ఉద్యమనేత, ఫైర్‌ బ్రాండ్‌కు జైలు శిక్ష

25 Jul, 2018 13:04 IST|Sakshi

అహ్మదాబాద్‌: పటేల్‌ కోటా ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2015లో పటేల్‌ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా చెలరేగిన  అల్లర్ల కేసులో  హార్దిక్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ  గుజరాత్‌లోని స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు 50వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది.  మొత్తం 17మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. హార్దిక్‌తోపాటు సర్దార్‌ పటేల్‌ వర్గం నేత లాల్జీ పటేల్‌, ఏకే పటేల్‌ను కూడా  దోషులుగా నిర్దారించింది. వీరికి కూడా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానాను కోర్టు విధించింది. మరోవైపు తీర్పువెలువడిన వెంటనే హార్దిక్‌కు చెందిన న్యాయవాది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

గుజరాత్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ నేతృత్వంలో 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా భారీ హింస చెలరేగింది.  ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌.. హింసకు ప్రేరేపించారని, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించారంటూ కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు