కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి

18 Jul, 2018 02:04 IST|Sakshi
గడ్కరీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మంత్రి హరీశ్‌

కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి హరీశ్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులు వచ్చినందున జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంత్రి హరీశ్‌రావు కోరారు. భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టిందని, కేంద్రం తరఫున కూడా తగిన సాయం అందించాలని విన్నవించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్, మాజీ ఎంపీ మందా జగన్నాథం మంగళవారం గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి కాళేశ్వరంపై చర్చించారు.

అనంతరం హరీశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ హోదాపై ప్రభుత్వ పరంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు చేపట్టిన ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం తనవంతు సాయం చేయాలని కోరారు. ప్రాజెక్టు అనుమతుల మంజూరులో గడ్కరీ ఎంతో సాయం చేశారన్న హరీశ్‌.. ప్రాజెక్టును చూసేందుకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు