విద్యార్థి నాయకులకు పదవులు హర్షణీయం

5 Dec, 2014 01:10 IST|Sakshi
విద్యార్థి నాయకులకు పదవులు హర్షణీయం
  • టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్
  • సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన విద్యార్థి నాయకుల్లో అగ్రభాగాన  ఉన్న వారందరికీ సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిజాక్ చైర్మన్ పిడమర్తి రవికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇవ్వడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

    గురువారం ఉదయం టీఆర్‌ఎస్ ఎంపీలు బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డిలు విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులను తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ విద్యార్థిలోకం స్వాగతిస్తోందని చెప్పారు.

    తెలంగాణ ఏర్పాటుకు ఎంత చిత్తశుద్ధితో పనిచేశామో..ప్రజాప్రతినిధులుగా తెలంగాణ పునర్‌నిర్మాణానికి అంతే పట్టుదలతో పనిచేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం త్వరలోనే లక్ష ఉద్యోగాల భర్తీకి  సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. మరో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, మెదక్ తరహాలో రైల్వే ప్రమాదాలు జరగకుండా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లులేని చోట వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  
     
    విద్యుత్ కేంద్రాల శంకుస్థాపనకు రండి

    పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని  టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి ఆయన ప్రధానిని కలసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. రామగుండంలో నాలుగువేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి  రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో గతప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా 1600 మెగావాట్ల ప్లాంట్ కోసం ఎన్టీపీసీ అధికారుల బృందం అధ్యయనం చేసిందన్నారు.

    మిగిలిన 2400 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటుచేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ విద్యుత్ కేంద్రాలకు వీలైనంత త్వరగా శంకుస్థాపన చేసేందుకు తప్పనిసరిగా రావాలని ప్రధానిని ఆహ్వానించినట్టు  సుమన్ అనంతరం విలేకరులకు తెలిపారు. అలాగే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని కోరినట్టు తెలిపారు. తాను దత్తత తీసుకున్న మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం దొండేపల్లి మండలం గూడెం గ్రామంలో చేపట్టిన కార్యాచరణను ఈసందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు.

>
మరిన్ని వార్తలు