ఆర్‌ఎంఎల్‌లో పారిశుధ్యంపై కేంద్ర మంత్రి సమీక్ష

11 Jun, 2014 22:18 IST|Sakshi
ఆర్‌ఎంఎల్‌లో పారిశుధ్యంపై కేంద్ర మంత్రి సమీక్ష

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఆ విభాగం మంత్రి హర్షవర్ధన్ బుధవారం ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు గంట సమయం ఆస్పత్రిలో గడిపిన మంత్రి పారిశుధ్య పరిస్థితిపై సమీక్షించారు. ఎమర్జెన్సీ, కార్డియాలజీ విభాగాలతో పాటు ప్లాస్టిక్ సర్జరీ, కాలిన గాయాలకు చికిత్స చేసే విభాగాలను కూడా సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని సెంట్రల్ పార్కును, ఎదురుగా ఉన్న పచ్చదనాన్ని పరిశీలించిన వర్ధన్ మొక్కలు, చెట్ల పరిరక్షణకు ఆస్పత్రి యాజమాన్యం చూపుతున్న శ్రద్ధను ప్రశంసించారు.
 
 ఆ తరువాత పీజీఐఎంఆర్‌కు చెందిన వివిధ విభాగాధిపతులను ఉద్దేశించి వర్ధన్ ప్రసంగిస్తూ ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిని ఓ విశిష్టమైన వైద్య కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నట్లు తెలి పారు. ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పోస్టుల సమస్యపై చర్చించిన వర్ధన్ ఆస్పత్రిలో సౌరశక్తి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఆస్పత్రిలో 280 డాక్టర్ పోస్టులకు గాను 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 800 నర్సుల ఉద్యోగాలకు గాను 200 ఖాళీగా ఉన్నాయి. ఇక పారా మెడికల్ సిబ్బంది పోస్టులు మూడింట ఒకవంతు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హెచ్‌కే కర్ చెప్పారు. వ్యర్ధ జలాల శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల రూ.3.6 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
 
 ప్రైవేటు ఆస్పత్రి మూసివేతకు ఆదేశం
 న్యూఢిల్లీ: అర్హతలేని వైద్యుడి చికిత్స కారణంగా రోగి మృతి ఘటన నేపథ్యంలో పశ్చిమ ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని మూసివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రోహిణీ ప్రాంతంలోని సెక్టార్-16లోగల సత్యం ఆస్పత్రి మూసివేతకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ (డీఎంసీ) నివేదికను పరిశీలించిన అనంతరం లెసైన్సును తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ ఎన్.వి.కామత్  ఆస్పత్రికి సమాచారం అందించారు. కాగా అర్హతలేని వ్యక్తి వైద్యసేవలు అందించిన కారణంగానే  సదరు ఆస్పత్రిలో చేరిన కామిని సోలంకి అనే రోగి మృతి చెందిందని నివేదిక పేర్కొంది.
 

మరిన్ని వార్తలు