ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

31 Jul, 2019 15:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాల కింద దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలను ఓ ప్రజా ఉద్యమంగా ఏర్పాటు చేస్తాం. ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కింద పది కోట్ల మంది పేదలకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెస్తాం’ అని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ జూన్‌ 3న తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. అది సాధ్యం కావాలంటే ప్రతి పదివేల మంది జనాభాకు 20 మంది డాక్టర్ల చొప్పున మొత్తం 44.5 శాతం మంది వైద్య సిబ్బంది ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదివేల మంది జనాభాకు పది మంది డాక్టర్ల చొప్పున మొత్తం 22.8 శాతం వైద్య సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం దేశంలో 22.8 శాతం వైద్య సిబ్బంది కూడా లేరు.

‘బీఎంజె ఓపెన్‌’ మెడికల్‌ జర్నల్‌ లెక్కల వరకు నేడు దేశంలో ప్రతి పదివేల మంది జనాభాకు 5.9 శాతం డాక్టర్లను కలుపుకొని మొత్తం వైద్య సిబ్బంది (నర్సులు, ఆయాలు, బాయ్‌లు) 20.6 శాతం మంది ఉన్నారు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఈ వైద్య సిబ్బంది 19 శాతం ఉండగా, కార్పొరేట్‌ సంస్థలు పలు వైద్య, నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల ఇప్పటికీ వైద్య సిబ్బంది సంఖ్య ఒకటిన్నర శాతం పెరిగింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్‌లు, ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్, మినిస్టరీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సంస్థల నుంచి సేకరించిన వివరాల ద్వారా ఈ లెక్కలు తెలిశాయి. దాదాపు 52 దేశాల్లో వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని తెలియడంతో 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి పదివేల మందికి కనీసం 22.8 శాతం వైద్య సిబ్బంది ఉండాలంటూ మార్గదర్శకాలను సూచించింది. 2016లో వాటిని సవరించింది. ఈ దేశంలోనైనా వైద్య సేవలను విశ్వవ్యాప్తం చేయాలన్నా వైద్య సిబ్బంది 44.5 శాతం ఉండాలని నిర్ధారించింది. దీన్ని సాధించాలంటే దేశ బడ్జెట్‌ను మొత్తం ఒక్క వైద్య రంగానికే కేటాయించాల్సి రావచ్చు. అది అసాధ్యం కనుక, కేంద్ర ఆరోగ్య మంత్రి హామీని అమలు చేయడం కూడా అసాధ్యమే.

మరిన్ని వార్తలు