ఇంకా మూడు వారాల లాక్‌డౌన్!

10 Apr, 2020 16:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  కరోనా వైరస్‌ కట్టడికి ఇంకా మూడు వారాల లాక్‌డౌన్‌ అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ అన్నారు. ఆయన శుక్రవారం అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబేతో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్‌ భవన్‌ నుంచి హర్షవర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి వివిధ రాష్ర్టాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా హర్షవర్థన్‌మాట్లాడుతూ... కరోనా చైనా నుంచి మిగిలిన దేశాలకు విస్తరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా 212 దేశాలకు వ్యాపించిందన్నారు. కరోనాపై యుద్ధానికి అందరూ సహకరిస్తున్నారన్నారు. కరోనాకు సరిహద్దులంటూ ఏమీ లేవని, కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కరోనాను తరిమికొట్టడంలో అందరూ మాస్కులు ధరించడం అత్యంత ప్రధానం అని పేర్కొన్నారు. (తెలంగాణలో ఇక మాస్క్‌లు తప్పనిసరి)

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌లోని బూర్గుల భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈటెల మాట్లాడుతూ..  రాష్ట్రం, దేశంలో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలకు సంబంధించిన టాక్స్‌ను ఎత్తివేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వాటికి కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని కోరారు.  రాష్ట్రానికి N-95 మాస్క్ లు, PPE కిట్స్, టెస్టింగ్ కిట్స్‌ వీలైనంత తొందరగా పంపించాలని హర్షవర్దన్‌ను కోరారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని, ఇక్కడ వచ్చిన పాజిటివ్ కేసుల్లో 85 శాతం మర్కజ్ నుంచి వచ్చినవారివేనని కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణలో మర్కజ్‌  కేసుల మినహా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అని ఈటల రాజేందర్ హర్షవర్దన్‌కు వెల్లడించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు