వైద్య‌ సిబ్బందికి రెట్టింపు వేత‌నం: సీఎం

10 Apr, 2020 19:34 IST|Sakshi

హ‌ర్యానా : క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్రాణాలు ర‌క్షించే వైద్య‌సిబ్బంది కోసం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి రెట్టింపు వేత‌నం ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు. ‘కరోనా వైరస్ ఉన్నంత కాలం, ఆ విభాగంలో సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ రెట్టింపు వేత‌నం ఇస్తాం .’ అని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. దీంతో పాటు కరోనా వైరస్ విధుల్లో పోలీసులు ఎవరైనా చనిపోతే ఆయా కుటుంబాల వారికి రూ.30లక్షల పరిహారం కూడా ఇస్తామని ప్రకటించారు. 

క‌రోనావైర‌స్‌ పై పోరాటంలో మాన‌వాళిని కాపాడ‌టానాకి త‌మ ప్రాణాల‌ను ప‌ణంతా పెట్టిన వైద్యులు, నర్సులను  దేవుళ్లుగా  అభివ‌ర్ణించిన  ఖ‌ట్ట‌ర్..  వైద్యులు, నర్సులు, పారామెడిక‌ల్  ఇతర సిబ్బందికి వరుసగా రూ .50 లక్షలు, రూ .30 లక్షలు, రూ .20 లక్షలు, రూ .10 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇది కేంద్రం ప్ర‌క‌టించిన .(లక్షా 70వేల కోట్ల ప్యాకేజీలో ) ఇన్సూరెన్స్ ప‌రిధిలోకి రానివారికి వ‌ర్తిస్తుంది. వైద్యులు ఇత‌ర వైద్య సిబ్బంది కృషిని గుర్తించి ప్ర‌భుత్వం తీసుకున్న ఈ  నిర్ణ‌యాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

ఇప్పటి వరకు హర్యానాలో 169 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 5865 కరోనా కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో 5218 చికిత్స పొందుతున్నారు. 477 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

మరిన్ని వార్తలు