ఢిల్లీ అల్లర్లు: ‘ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి’

27 Feb, 2020 15:43 IST|Sakshi

చండీగఢ్‌: దేశ రాజధాని ఢిల్లీలో ఇంతకుముందు కూడా అల్లర్లు జరిగాయని.. ఇవన్నీ జీవితంలో భాగమేనంటూ హర్యానా మంత్రి రంజిత్‌ చౌతాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఇప్పటి వరకు దాదాపు 35 మంది మరణించిన విషయం విదితమే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన రంజిత్‌ చౌతాలా 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ...‘‘అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది. ఇందిరా గాంధీని హత్యగావించబడిన సమయంలో.. ఢిల్లీ మొత్తం అట్టుడికిపోయింది. ఇదంతా జీవితంలో భాగమే. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి’’ అని పేర్కొన్నారు.(అర్ధరాత్రి విచారణ.. ఆ న్యాయమూర్తి బదిలీ)

ఇదిలా ఉండగా... ఢిల్లీలో చెలరేగిన హింసను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి మెమొరాండం సమర్పించింది. మరోవైపు ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపిన ఢిల్లీ హైకోర్టు జడ్జిని బదిలీ చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. ఈ విషయంపై స్పందించిన న్యాయ శాఖా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కొలీజియం సిఫారసులు మేరకే సదరు న్యాయమూర్తిని బదిలీ చేశామని వివరణ ఇచ్చారు.(రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ పార్టీ బృందం)

చదవండి: ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఆఫీసర్‌ మృతదేహం

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు...
మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్‌ సింగ్‌, బియాత్‌ సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన నేపథ్యంలో ఆనాడు దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఢిల్లీలో చెలరేగిన హింసలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో.. ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదనే కారణంతో 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేశారు. తదనంతర కాలంలో తమకు న్యాయం జరగాలంటూ సిక్కు నేతలు డిమాండ్‌ చేయడంతో ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)చే విచారణ జరిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత పాశవికంగా హత్య గావించబడ్డారని, ఇవి ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యలేనని సిట్‌ నివేదిక సమర్పించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన యశ్‌పాల్‌, నరేశ్‌లకు శిక్షలు ఖరారు చేస్తూ ఢిల్లీ పాటియాల కోర్టు 2018లో వెలువరించింది.(భయపడవద్దు.. మాట ఇస్తున్నా: అజిత్‌ దోవల్‌)

మరిన్ని వార్తలు