వాళ్లను ఢిల్లీలోనే ఉండనివ్వండి: మంత్రి

27 Apr, 2020 15:22 IST|Sakshi

చండీగఢ్‌: లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో పనిచేస్తున్న హర్యానా ప్రజలు అక్కడే ఉండేలా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏర్పాట్లు చేయాలని హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్‌ విజ్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసరాల నిమిత్తం జారీ చేసిన పాసులను ఉపయోగించి కొంతమంది ప్రజలు తరచూ ప్రయాణాలు చేస్తూ కరోనా కారియర్స్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం అనిల్‌ విజ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరై రాష్ట్రానికి వచ్చిన వారిలో 120 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారి చికిత్స ఖర్చులను హర్యానా సర్కారే భరించింది. ఇక ఇప్పుడు ఢిల్లీలో పనిచేసే చాలా మంది వ్యక్తులు పాసులు ఉపయోగించి రోజూ అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోంది’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(అమెరికా, చైనా, భారత్‌ ఎంత ఖర్చు చేశాయంటే..)

ఇక హర్యానా పోలీసు అధికారి సోదరి ఒకరు ఢిల్లీలో పనిచేస్తున్నారని.. ఆమె కారణంగా కుటుంబం మొత్తం కోవిడ్‌-19 బారిన పడిందని అనిల్‌ విజ్‌ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా  సోనిపట్‌లో 9 మందికి కరోనా వైరస్‌ సోకిందని తెలిపారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న వాళ్లకు పాసులు ఇచ్చి హర్యానాకు పంపవద్దని... వారికి అక్కడే క్వారంటైన్‌ చేయాలని కేజ్రీవాల్‌ను కోరారు. ఇతర రాష్ట్రాలు తమ ప్రజలను సొంత స్థలాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటే అనిల్‌ విజ్‌ ఈ విధంగా మాట్లాడటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా హర్యానా వ్యాప్తంగా ఇప్పటివరకు 280 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మూడు మరణాలు సంభవించాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 800 దాటగా.. 27 వేల మందికి పైగా మహమ్మారి సోకింది. (జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు‌ విముక్తి!)

మరిన్ని వార్తలు