రైతుల పరిస్థితి ఎంత మారింది?

1 Apr, 2019 16:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం. ఓ పంట ఉత్పత్తికయ్యే ఖర్చుకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఆ పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తాం. దేశంలోని వ్యవసాయ మార్కెట్లన్నింటిని హేతుబద్ధం చేస్తాం. పంట సేకరణ వ్యవస్థను, సంస్థలను మరింత పటిష్టం చేస్తాం. ఆహార ఉత్పత్తి మరింత పెరిగేందుకు కృషి చేస్తాం’ ఈ హామీలతో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభం లాంటిది కావడం, దేశంలో అధిక జనభా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తుండడం వల్లనే బీజేపీ ఈ రంగానికి ప్రాధ్యానత ఇవ్వాలని నిర్ణయించి ఈ హామీలను ఇచ్చింది. మరి ఈ హామీల్లో ఎన్నింటిని పాలకపక్షం నెరవేర్చింది? ఏ మేరకు నెరవేర్చింది?

1. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ‘నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)’ ఓ ప్రణాళికను 2016లో విడుదల చేసింది. అదే సంవత్సరం పండించిన పంటలకు సరైన గిట్టుబాటు లభించక దేశవ్యాప్తంగా రైతులు పలుసార్లు ఆందోళనలు చేశారు. పంట రుణాలను రద్దు చేయడంతోపాటు ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను  అమలు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు.


ఢిల్లీలో కిసాన్‌ ముక్తి మోర్చా ర్యాలీలో పాల్గొన్న మహిళలు (ఫైల్‌)

2. 2018, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువ స్థాయికి పడిపోయిందని పలు నివేదికలు వెల్లడించాయి. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పటి నుంచి వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

3. దేశంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కోసం 1980–81 సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడులు 43.2 శాతం ఉండగా, అవి 2016–17 సంవత్సరానికి 18.8 శాతానికి పడిపోయింది.

4. వ్యవసాయ ఉత్పత్తులకయ్యే ఖర్చుకన్నా వాటికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరను కల్పిస్తామన్న హామీని మొదటి నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. 2018లో బడ్జెట్‌ ప్రతిపాదనల సందర్భంగా కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ హామీని పునరుద్ఘాటించారు. అదే ఏడాది ఓ నెల ఆలస్యంగా అంటే 2018, జూలై నెలలో ఖరీఫ్‌ పంటలకు బీజేపీ ప్రభుత్వం పంట ఉత్పత్తులకన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా కనీస మద్దతు ధరను నిర్ణయించింది. అయితే రైతులు డిమాండ్‌ చేసిన ‘సీ 2’ ఫార్ములా ప్రకారం కాకుండా ‘ఏ2ప్లస్‌ ఎఫ్‌ఎల్‌’ ఫార్ములా ప్రకారం కేంద్రం కనీస మద్దతు ధరలను ప్రకటించింది. పంట పంట గింజలు, ఎరువులు, ఓ కుటుంబం పడిన శ్రమను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భూమి లీజుకు అయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోలేదు.

5. తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడిని సాధించడం, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, తక్కువ నీరు అవసరమైన పంటలను ప్రోత్సహించడం, రైతుల భూములు ఎలాంటి పంటలకు అనువైనవో భూ పరీక్షలు నిర్వహించి రైతులకు భూసార కార్డులను అందజేయడం, క్రిమిసంహారక మందుల ఉపయోగాన్ని నియత్రించడం, దేశంలో ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం కింద ఆహార శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమల్లో కూడా పురోగతి అంతంత మాతంగానే ఉంది.

6. సేంద్రీయ ఎరువల విధానం, పంట నష్టం స్కీమ్, రైతు రుణ వ్యవస్థ విస్తరణ, జన్యు మార్పిడి విత్తనాలు అనుమతించక పోవడం ఎన్నో స్కీమ్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. రైతులకు ఎప్పటికప్పుడు పంట సలహాలు ఇవ్వడానికి అన్ని ప్రాంతీయ భాషల్లో 24 గంటల ప్రసార ఛానళ్లను ప్రవేశపెడతామని కూడా బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ‘డీడీ కిసాన్‌’ పేరిట ఓ హిందీ ఛానల్‌ను మాత్రమే ఏర్పాటు చేయగలిగింది. ప్రాంతీయ ఛనాళ్ల ఊసే లేదు.

మరిన్ని వార్తలు