'నా భార్య మరణంపై దాచిందేం లేదు'

9 May, 2017 17:46 IST|Sakshi
'నా భార్య మరణంపై దాచిందేం లేదు'

తిరువనంతరపురం: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ మంగళవారం మీడియాపై ఎదురుదాడి చేశారు. తన భార్య సునంద పుష్కర్‌ హత్యకు గురయ్యారని ఓ జాతీయ టీవీ చానెల్‌ వేసిన కథనంపై ఆయన స్పందించారు. పుష్కర్‌ మరణం గురించి తాను దాచిందేం లేదని అన్నారు. 2014 జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్‌లో పుష్కర్‌ చనిపోయి కనిపించారు. పుష్కర్‌ మరణంపై తాజాగా ఓ కథనం వేసిన జాతీయ చానెల్‌.. ఆమె మరణం వెనుక శశిథరూర్‌ హస్తం ఉందని పేర్కొంది.

దీంతో షాక్‌కు గురైన శశిథరూర్‌.. మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా మీడియా రంగంలోకి వచ్చిన చానెల్‌ గుర్తింపు కోసం తనపై బురద జల్లుతోందని ఆరోపించారు. వ్యవస్ధలో మీడియాకు చాలా ముఖ్య పాత్ర ఉన్నా.. ఓ జడ్జికి రాజ్యాంగా పరంగా లభించిన హక్కు దానికి లేదని అ‍న్నారు. పుష్కర్‌ మృతిపై పోలీసులతో తన వద్ద ఉన్న సమాచారం మొత్తం చెప్పానని తెలిపారు. గత మూడేళ్లుగా పోలీసుల విచారణలో ఉన్న అంశాలనే చానెల్‌ కూడా చూపించిందని చెప్పారు. సునంద మరణం హత్యో.. కాదో.. పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదని చెప్పారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ పుష్కర్‌ మరణం విష ప్రయోగం వల్ల సంభవించిదని పేర్కొన్న విషయం తెలిసిందే.

చానెల్‌ కథనం ఏంటి?
పుష్కర్‌ మరణం అనంతరం లీలా హోటల్‌లో ఆమెను ఉన్న గది నుంచి మరో గదికి మార్చినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి శశిథరూర్‌కు సన్నిహితుడైన ఓ వ్యక్తికి.. చానెల్‌ న్యూస్‌ కరస్పాడెంట్‌కు మధ్య జరిగిన 19 కాల్‌ల సంభాషణలను వినిపించింది. పోలీసులు హోటల్‌కు చేరుకునే లోపు పుష్కర్‌ బాడీని హోటల్లోని రూం నెంబర్‌ 307 నుంచి రూం నెంబర్‌ 345కు మార్చారని పేర్కొంది. ఆ సమయంలో హత్యను ఆత్మహత్యగా చిత్రికరించేందుకు యత్నించినట్లు చెప్పింది. పుష్కర్‌ మరణానికి ముందు భర్త శశిథరూర్‌తో వాగ్వాదం జరిగిందని పేర్కొంది.

అంతకుముందు రోజు పాకిస్తానీ జర్నలిస్టు మెహర్‌ తరార్‌ను ఉద్దేశించి పుష్కర్‌ ట్వీట్‌ చేసినట్లు వెల్లడించింది. థరూర్‌, తరార్‌ల మధ్య ఉన్న సంబంధంపై ఆమె ట్వీట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. పుష్కర్‌ ట్వీట్‌ను తరార్‌ థరూర్‌కు పంపినట్లు పేర్కొంది. పోస్టుమార్టం రిపోర్టులో పుష్కర్‌ ఎక్కువ స్లీపింగ్‌ పిల్స్‌ను తీసుకోవడం వల్ల మరణించిందని ఉందని చెప్పింది. పుష్కర్‌ హత్యకు గురయ్యారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం ధ్రువీకరించలేకపోతున్నట్లు రిపోర్టులో ఉందని సదరు చానెల్‌ వివరించింది.

మరిన్ని వార్తలు