అలీబాగ్‌లో అడుగుపెట్టలేవు

12 Nov, 2017 02:15 IST|Sakshi

షారుక్‌కు మహారాష్ట్ర ఎమ్మెల్సీ హెచ్చరిక

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌పై మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నవంబర్‌ 3న ముంబై గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతం అలీబాగ్‌కు వెళ్లేందుకు ఎమ్మెల్సీ జయంత్‌ పాటిల్‌ ముంబైలోని గేట్‌ వే ఇండియా రేవుకు చేరుకున్నారు. అదే సమయంలో పుట్టిన రోజు వేడుకల కోసం అలీబాగ్‌ వెళ్లేందుకు సొంత పడవలో షారుక్‌ ఖాన్‌ రేవులో వేచిఉన్నారు.

షారుక్‌ పడవ ఎంతకీ కదలకపోవడం జయంత్‌కు కోపమొచ్చింది. షారుక్‌ దగ్గరికెళ్లి నిలదీశారు. ‘నువ్వు సూపర్‌ స్టార్‌వి కావచ్చు. అలీబాగ్‌ను కొన్నావా? నా అనుమతి లేనిదే అలీబాగ్‌లోకి అడుగుపెట్టలేవు’ అని హెచ్చరించారు.  ఘటనపై శనివారం ఆయన వివరణ ఇస్తూ.. ‘నేను అలీబాగ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాను. రేవులో షారూక్‌ పడవ చాలాసేపు అక్కడే ఉంది. అభిమానులకు చేతులూపుతూ షారుక్‌ చాలా తీరిగ్గా కనిపించారు. నేను తొందరగా వెళ్లాల్సి ఉండగా షారుక్‌ మాత్రం ఎలాంటి కంగారు లేకుండా ఉండడం వల్లే ఆగ్రహంతో మాట్లాడాను అని జయంత్‌ చెప్పారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు