ముంబాయిలో భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టు

2 Jul, 2013 13:14 IST|Sakshi

ముంబయి : ముంబాయిలో భారీ హవాలా రాకెట్‌ గుట్టు రట్టు అయింది. నాలుగు టెంపోల్లో తరలిస్తున్న విలువైన వస్తువులను, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి వీలువ ఎంత అనేది తెలియరావడం లేదు. అయితే ఐటీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ విలువ 2,500 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ-ఎన్ఐఏ, ఇన్‌కమ్‌ట్యాక్స్‌-ఐటీ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. గత రాత్రి 9 గంటల సమయంలో జరిగిన జాయింట్‌ ఆపరేషన్‌లో సుమారు 100 అధికారులు పాల్గొన్నారు.

4 టెంపోల్లో 150 బ్యాగుల్లో విలువైన వస్తువులు, నగదు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో టెంపోలో 15 మంది వ్యక్తులు ఉన్నారని సమాచారం. వీరిలో 45 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  ముంబాయి సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో హవాల్‌ రాకెట్‌ను పట్టుకున్నారు. టెంపోల్లోని బ్యాగులను గుజరాత్‌ తరలించేందుకు ప్రణాళిక వేసినట్లు ఐటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. విలువైన వస్తువుల్లో దొంగతనంగా తరలిస్తున్న బంగారం, వజ్రాలు కూడా ఉన్నాయని అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం మధ్యాహ్నం తరువాత తెలుస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.  

కాగా ముంబాయిలో పట్టుబడ్డ హవాలా సొమ్మును, విలువైన వస్తువులను తరలిస్తున్నది అంగాడియాలని అనుమానిస్తున్నారు. హవాలా సొమ్మును, వజ్రాలను, బంగారం, ఆభరణాలను దొంగతనంగా తరలించడంలో అంగాడియాలు సిద్ధహస్తులు. గుజరాతీ, మార్వాడీ వ్యాపారస్థుల దొంగ సొమ్మును తరలించడంలో వీరికి వీరే సాటి.

వీరు సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థగా పని చేస్తారని చెబుతారు. తాము తరలించిన డబ్బుకు, విలువైన వస్తువులకు బదులుగా 0.2 నుంచి 0.5 శాతం కమీషన్‌ తీసుకుంటారు. హిందీలో అంగాడియా అంటే కొరియర్‌ అని అర్థం. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో అంగాడియాలకు నెట్‌వర్క్‌ ఉంది. గతంలో టెర్రరిస్టు కార్యకలాపాలకు కూడా అంగాడియాలు నిధులు చేరవేసిన చరిత్ర ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా