’ఇక ఎన్నికల పనిపట్టండి’

10 Nov, 2016 19:07 IST|Sakshi
’ఇక ఎన్నికల పనిపట్టండి’

అహ్మద్‌నగర్‌: పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో కూడుకున్నదని, విప్లవాత్మక నిర్ణయం అని అవినీతి వ్యతిరేక సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో నల్ల ధనం తగ్గిపోతుందని, ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు తరలిస్తున్న పెద్ద మొత్తాలకు అడ్డుకట్ట వేసినట్లవుతుందన్నారు. అవినీతి కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలేవీ కూడా నల్లధనాన్ని రూపుమాపే చర్యలు తీసుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ధైర్యంతో వేసిన ముందడుగని, దీంతో ప్రజాస్వామ్యాన్ని శక్తిమంతమవుతుందన్నారు.

రాజకీయ పార్టీలు కూడా పెద్ద మొత్తంలో అక్రమ నిధులు తరలిస్తున్నందున, ప్రభుత్వం తదుపరి దృష్టిని ఎన్నికల విధానాన్ని శుద్ధి చేసే అంశంపై పెట్టాలని సూచించారు. ఎన్నికల్లోకి నల్లధనం రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పెద్ద మొత్తంలో ఎన్నికల సంస్కరణలు చేయాలని కోరారు. దాదాపు అన్ని పార్టీలు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొని రశీదులు మాత్రం రూ.20 వేలు అంటూ ఇస్తుంటారని, ఇవన్నీ పన్ను ఎగువేతకోసమేనని ఆరోపించారు. ఎన్నికలు మరింత పారదర్శకంగా జరిపేందుకు ఇదే తగిన సమయం అని హజారే చెప్పారు.

>
మరిన్ని వార్తలు