మీ యంత్రాంగం పని చేయడం లేదు

13 Nov, 2014 00:26 IST|Sakshi
మీ యంత్రాంగం పని చేయడం లేదు

పారిశుధ్యం నిర్వహణలో వైఫల్యంపై ఎంసీడీకి హైకోర్టు మొట్టికాయ
న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో విఫలమైనందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. నగరంలోని ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎంతమంది సఫాయి కార్మికులు ఉన్నారు, వారు ఎక్కడ పని చేస్తున్నారో వివరిస్తూ ఓ స్థాయీ నివేదికను సమర్పించాలని న్యాయమూర్తులు బదర్ దుర్రేజ్ అహ్మద్, సిద్ధార్థ్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం ఎంసీడీని ఆదేశించింది. ‘‘మీ యంత్రాంగం పని చేయడం లేదు. దీనిపై దృష్టి సారించండి’’ అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తులు వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను అందచేయాలని ఎంసీడీ తరఫు న్యాయవాదిని ఆదేశించారు.

ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఆదివారాలు, సెలవు దినాలతో సహా ఢిల్లీలో ప్రతిరోజూ వీధులు, బహిరంగ ప్రదేశాలు, మురుగు కాల్వలు, పార్కులను శుభ్రం చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు గత సెప్టెంబర్ 10న పునరుద్ధరించింది. చరిత్రాత్మకమైన నగరం, భారతదేశ రాజధాని ఢిల్లీప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాలలో ఒకటిగా మారిందంటూ సుప్రీం కోర్టు 1996లో వ్యాఖ్యానించినప్పటికీ, పారిశుధ్యం నిర్వహణలో ప్రభుత్వ సంస్థలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ న్యాయభూమి అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది.

రోడ్లు ఊడ్చే వ్యక్తి తన విధులకు గైర్హాజరైతే ఎంసీడీ చట్టంలోని 387 సెక్షన్ ప్రకారం మున్సిపల్ మేజిస్ట్రేట్‌లు 30 రోజుల జైలుశిక్షను విధించవచ్చు. నగరంలోని విద్య, వైద్య సంస్థలు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, మరుగుదొడ్లు కూడా లేవని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది శరణ్ పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్యాన్ని నిర్వహించేందుకు, పరిస్థితులను మెరుగుపరిచేందుకు సుప్రీం కోర్టు 14 మార్గదర్శకాలను జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు