అవి ఎన్‌కౌంటర్‌ ఆదేశాలే!

26 Dec, 2018 14:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి, ఏం ఫర్వాలేదు!’ అని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి మంగళవారం నాడు ఓ సీనియర్‌ పోలీసు ఆఫీసర్‌ను ఫోన్‌లో ఆదేశించడం వైరల్‌ అవడంతో తాను ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ఓ సామాన్య పౌరుడిగా ఉద్వేగంతో చేసిన వ్యాఖ్యలంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. జేడీఎస్‌ నాయకుడు ప్రకాష్‌ను ప్రత్యర్థులు చంపడం పట్ల కుమార స్వామి స్పందించిన తీరిది. నోరు జరాననో, ఉద్వేగంతో మాట్లాడానంటూ సర్దు కోవడానికి ప్రయత్నిస్తే సమసిపోయే విషయం కాదది.
 
అధికారంలో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రతీకారాలకు బూటకపు ఎన్‌కౌంటర్లకు అలవాటైన రోజులివి. హతుడు ప్రకాష్‌ పార్టీకి విదేయుడని కుమార స్వామి చెబుతున్నారుగానీ, ఆయన పార్టీకంటే ఎక్కువగా కుమార స్వామి విధేయుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుమార స్వామి విజయం కోసమే ఎక్కువగా పార్టీలో ప్రచారం చేశారు. అంతటి వ్యక్తి చనిపోతే అంతగా ఆవేశం రావడం నిజమేగానీ, ‘వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి, ఏం ఫర్వాలేదు’ అంటూ ప్రత్యేక అధికారాలిచ్చే అవకాశం కూడా పూర్తిగా ఉంది. కుమారస్వామి ఆదేశించిందీ లేదా వ్యాఖ్యానించిందీ పార్టీ నాయకులనో, కార్యకర్తలనుద్దేశించో కాదు, సాక్షాత్తు సీనియర్‌ పోలీసు అధికారిని ఉద్దేశించింది. 

దేశంలో 2005లో గుజరాత్‌లో జరిగిన ‘సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌’ కేసు నుంచి బూటకపు ఎన్‌కౌంటర్లకు అధికారిక ఆమోద ముద్ర లభించినట్లు ఉంది. భోపాల్‌ కారాగారం నుంచి పారిపోయారన్న కారణంగా 2016, అక్టోబర్‌ నెలలో ఎనిమిది మంది సిమీ కార్యకర్తలను పోలీసులు కాల్చి చంపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదంటూ పౌరులకు నీతులు చెప్పే ప్రభుత్వాలకే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అలవాటయింది. చట్టం అంటే అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత విచారించడం, అందుకు సరైన ఆధారాలు చూపించడమే కాకుండా నిందితులకు తమను తాము సమర్థించుకునే హక్కు కూడా ఉండడం. ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం పడుతుంది కనుక ప్రభుత్వాలు కూడా దొడ్డిదారి ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నాయి.

మరిన్ని వార్తలు