కొత్తజిల్లాకు పచ్చజెండా

13 Jun, 2014 23:14 IST|Sakshi
కొత్తజిల్లాకు పచ్చజెండా

సాక్షి, ముంబై: సుదీర్ఘ స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు ఠాణే జిల్లా విభజనకు కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో 36వ జిల్లాగా పాల్ఘర్ ఆవిర్భవించనుంది. కొత్తగా ఏర్పడనున్న ఈ జిల్లాలో ఎనిమిది తాలూకాలుంటాయి. పాల్ఘర్, జవహర్, మొఖాడా, తలసారి, వసయి, వాడా, డహణు, విక్రమ్‌గఢ్ తాలూకాలు పాల్ఘర్ జిల్లాలో ఉంటాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇక ఠాణే జిల్లా ఏడు తాలూకాలకే పరిమితం కానుందని, ఠాణే, కల్యాణ్, అంబర్‌నాథ్, ఉల్హాస్‌నగర్, భివండీ, ముర్బాద్, షాహాపూర్  తాలూకాలు ఠాణే జిల్లాలో ఉండనున్నాయని, పాల్ఘర్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 450 కోట్లు కేటాయించనుందని చెప్పారు.
 
కొత్తగా ఏర్పాటు కానున్న పాల్ఘర్ జిల్లా ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం రెండున్నర నెలల సమయం పడుతుందన్నారు. జిల్లాల విభజన అంశం శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినా మిగతా జిల్లాల విభజన జోలికి పోకుండా కేవలం ఠాణే జిల్లా విభజనకే సమావేశాలను పరిమితం చేశారని, ఇతర నిర్ణయాలేవీ తీసుకోలేదన్నారు. ఉపాధి హామీ పథకం అమలు మంత్రి నితిన్ రావుత్ ఈ విషయాన్ని కేబినెట్ సమావేశంలో లేవనెత్తగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
 
సుపరిపాలనకు మార్గం సులభం...

కొత్త జిల్లా ఏర్పాటు కావడంతో పాల్ఘర్ పరిసర తాలూకాల ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ఇప్పటిదాకా ఏ అవసరం పడినా జిల్లా కేంద్రమైన ఠాణే వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా పాల్ఘర్‌లోనే అన్ని అవసరాలు తీరే అవకాశముంది. పైగా ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు రూ. 450 కోట్లు కేటాయించనుండడంతో పాల్ఘర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల స్వరూపమే మారిపోయే అవకాశముంది.
 
ఠాణే జిల్లాను విభజించాల్సిన అవసరం ఎంతైన ఉందని 1985లో అప్పటి ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పటి నుంచి శాసనసభ ఎన్నికలు సమీపించగానే ఈ అంశం తెరమీదకు వచ్చేది. ఆ తరువాత అటకెక్కేది. కాని ఠాణే జిల్లాకు వలసలు పెరిగిపోవడం, ఉపాధి కారణంగా జనాభా విపరీతంగా పెరిగిపోవడం మొదలైంది. దీంతో 9,558 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ జిల్లాను విభజించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు అనేక ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు జరిగాయి.
 
కొందరైతే దీన్ని మూడు జిల్లాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం రాష్ట్రప్రభుత్వం స్వయంగా చొరవ  తీసుకొని 2013 మే ఒకటో తేదీ వరకు విభజిస్తామని ప్రకటించింది. కాని కాంగ్రెస్, మిత్రపక్షమైన ఎన్సీపీ మధ్య నెలకొన్న విభేదాల కారణంగా విభజన అంశం వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత 2014 ఆగస్టు 15లోపు ఠాణేను విభజించి తీరుతామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. దీంతో విభజన ప్రక్రియ పనులు వేగం పుంజుకున్నాయి. ఇదిలావుండగా సభాపతి శివాజీరావ్ దేశ్‌ముఖ్ అధ్యక్షతన ఇటీవలే అఖిలపక్ష సమావేశం జరిగింది.
 
ఇందులో వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్కరించడంతో మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్ సమావేశంలో విభజన ప్రక్రియకు ఆమోదముద్రవేశారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన ప్రక్రియను ఏ రాజకీయ పార్టీ అడ్డుకునే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో త్వరలో పాల్ఘర్ 36వ జిల్లాగా అవతరించనుంది. కాగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో విభజన కీర్తి దక్కించుకునేందుకు అధికార పార్టీలు, ప్రతిపక్షం ప్రచార సభల్లో పోటీ పడనున్నాయి.
 
రైతుల విద్యుత్ బకాయిలు సగం మాఫీ: సర్కార్
విద్యుత్ బకాయిల విషయంలో రైతులకు ఊరట కల్పించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31 వరకు రైతుల విద్యుత్ బిల్లులో సగం మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా సగం చెల్లించినవారు ఇకపై చెల్లించనక్కరలేదని, అసలు చెల్లించనివారు సగం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది.
 
ఇది జరిమానాలతో కలిపి వర్తిస్తుందని, చెల్లించలేని స్థితిలో ఉన్నవారు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలలపాటు మూడు వాయిదాల్లో చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రా న్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే ఆరోపించారు.

మరిన్ని వార్తలు