ఖాదిర్‌ దేవుడిలా వచ్చి నన్ను కాపాడాడు: యూపీ పోలీస్‌

27 Dec, 2019 14:06 IST|Sakshi

లక్నో : కేంద్రం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రోజురోజుకీ నిరసనలు పెరుగూతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. తాజాగా యూపీలో ఫిరోజాబాద్‌లో చోటుచేసుకున్న ఆందోళనలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో.. నిరసనకారులు పోలీసులపై దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడ్డ అజయ్‌ కుమార్‌ అనే పోలీసును హజ్జీ ఖాదిర్‌ అనే ఓ వ్యక్తి  కాపాడాడు. అతన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం అందించి అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు.

ఈ విషయం గురించి సదరు పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘నేను బతుకుతానో లేదో అన్న సమయంలో నన్ను హజ్జీ ఖాదిర్‌ వచ్చి రక్షించాడు.. అతను నా జీవితంలో దేవుడిలా వచ్చి నన్ను కాపాడాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లి నా బాగోగులు చూశాడు’ అని చెప్పుకొచ్చారు. అల్లర్లు జరుగుతున్న సమయంలో స్థానికంగా ఉన్న మసీదులో నమాజ్‌ చేసుకుంటున్నానని, ఈ ఘర్షన గురించి తెలియగానే సంఘటన ప్రాంతానికి వెళ్లి అజయ్‌ను రక్షించానని ఖాదీర్‌ తెలిపారు. కాగా తాను కేవలం మానవత్వంతోనే ఆయన్ని రక్షించానని ఖాదిర్‌ పేర్కొన్నారు. ఇక ఫిరోజాబాద్‌లో హింసాత్మక దాడులు చెలరేగడంతో నిరసనకారులు పోలీసులపై దాడితో సహా ఆరు వాహనాలకు వారు నిప్పంటించారు. ఈ క్రమంలో పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించారు. ఘర్షణల్లో అయిదుగురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు