రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం

11 Jul, 2020 08:59 IST|Sakshi

లక్నో: గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌పై అతని భార్య రిచా దుబే స్పందించారు. పోలీసులపై మారణకాండకు పాల్పడ్డ వికాస్‌ ఇలాంటి చావుకు అర్హుడే అని ఆమె వ్యాఖ్యానించారు. కాన్పూర్‌లోని భైరోఘాట్‌లో వికాస్‌ దుబే అంత్యక్రియల్లో రిచా పాల్గొన్నారు. ఆమె వెంట కుమారుడు, తన తమ్ముడు దినేష్‌ తివారీ ఉన్నారు. దుబే మృతదేహానికి ఎలక్ట్రిక్‌ క్రిమేషన్ మెషీన్‌లో.. అతని బావమరిది దినేష్‌ తివారీ అంత్యక్రియలు నిర్వహించారు. ఈక్రమంలో వికాస్‌ ఎన్‌కౌంటర్‌ కావడంపై స్పందించాలనే వార్తా రిపోర్టర్లపై ఆమె మండిపడ్డారు. వికాస్‌ చాలా పెద్ద తప్పు చేశాడని, అతనికి చావు ఇలా రాసి పెట్టి ఉందని రిచా చెప్పారు. మీవల్లే వికాస్‌కు ఈ గతి పట్టిందని, దయచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆమె రిపోర్టర్లకు విజ్ఞప్తి చేశారు.

 (చదవండి: వికాస్‌ దుబే ప్రధాన అనుచరుడు అరెస్ట్‌)

రూరల్‌ ఎస్పీ బ్రిజేష్‌ శ్రీవాత్సవ సమక్షంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ వికాస్‌ అంత్యక్రియలు జరిగాయి. కాగా, శుక్రవారం ఉదయం వికాస్‌ దుబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. అతన్ని ఉజ్జయినిలో పట్టుకున్న స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసలు కాన్పూర్‌కు తరలిస్తుండగా వారి వాహనం బోల్తా పడింది. అదే అదనుగా భావించి దుబే తప్పిచుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో పోలీసులకు అతనికి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కాల్పుల్లో ఇద్దరు ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది కూడా  గాయపడ్డారని పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పారు.
(ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు