మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ లేదు

2 Jul, 2020 16:25 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. అధిక పాజిటివ్‌ కేసుల నమోదులో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో వైరస్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ స్టేజ్‌కి వచ్చిందని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం స్పందించారు. రాష్ట్రంలో వైరస్‌కు సంబంధించి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరగలేదని స్పష్టం చేశారు. ఇక వైరస్‌ బారిన పడిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్‌)

అదే విధంగా కరోనా చికిత్సలో ప్లాస్మా థెరఫి కీలక పాత్ర పోషిస్తోందని రాజేష్‌ తోపే తెలిపారు. ఈ చికిత్సలో సుమారు 10 మంది కరోనా బాధితుల్లో 9 మంది కోలుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 వేల మంది కరోనా పేషెంట్లు వ్యాధి నుంచి కోలుకున్నారని వెల్లడించారు. చాలామంది పాజిటివ్‌ బాధితుల హిస్టరీ గమనిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా కేంద్రాల్లో, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ తీవ్రతను గమనిస్తే కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ స్టేజ్‌కి చేరలేదని వెల్లడించారు. ఇక రెమిడిసివిర్‌, ఫావిపిరవిర్ మందులు మరో రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో లభిస్తాయని తెలిపారు. ధనిక, పేద తేడాలు లేకుండా ప్రజలందరికీ ఈ మందులను అందుబాటులోకి తీసుకువస్తామని రాజేష్‌ తోపే చెప్పారు.(కరోనా : 30 రోజుల్లో 3,94,958 కేసులు )

మరిన్ని వార్తలు