344 ఔషధాలపై ఆరోగ్యశాఖ నిషేధం!

14 Mar, 2016 20:28 IST|Sakshi
344 ఔషధాలపై ఆరోగ్యశాఖ నిషేధం!

దేశవ్యాప్తంగా చలామణి అవుతున్న 344 కాంబినేషన్ ఔషధాలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. వీటిలో ముఖ్యంగా కోరెక్స్, ఫెన్సిడిల్ వంటి దగ్గు మందుల వాడకంతో అనేక నష్టాలు కలుగుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.  ప్రస్తుత నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా  ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాంబినేషన్ ఔషధాలు మెదడుకు హాని చేస్తుండటమే నిషేధానికి ప్రముఖ కారణంగా తెలుస్తోంది.

ఆరోగ్యశాఖ నిషేధం విధించిన 344 డ్రగ్స్ పై గతంలోనే ప్రతిపాదనలు తెచ్చింది.  అయితే అప్పట్నుంచీ పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఆమోదించారు. ప్రముఖ సైంటిస్టుల పరిశోధనల్లో ఆయా ఔషధాలు హాని కలిగించేవిగా నిర్థారించారని.. దీంతో వెంటనే వాటిపై నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. నిషేధించిన ఔషధాలను తయారుచేస్తున్న 344 పైగా కంపెనీలకు  షోకాజ్ నోటీసులను కూడ జారీ చేసింది. నిపుణుల సలహాల మేరకు తదితర సమాచారాన్ని అందిచనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధం అనేక పరీక్షల అనంతరం అమల్లోకి తెచ్చామని తెలిపారు.

కాంబినేషన్ డ్రగ్స్ ను రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో ఉత్పత్తిచేసి మార్కెట్లో ప్రవేశ పెడుతున్న కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం 2014 లో దృష్టి సారించింది. సుమారు ఆరువేల సమ్మేళనాలను సమీక్షించేందుకు అప్పట్లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నిర్థారణ మేరకు ఆయా ఔషధాలపై ప్రస్తుతం నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. నిపుణుల కమిటి సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం... ఆయా  ఔషధాల ఉత్పత్తి, అమ్మకాలతోపాటు పంపిణీపైనా  నిషేధం విధించింది.

 

కాంబినేషన్ డ్రగ్స్ తో దేశ ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తాజా నోటిఫికేషన్లో వెల్లడించింది. ముఖ్యంగా మార్కెట్లో అత్యధికంగా కొనుగోలు చేస్తున్న క్లోఫెనిరామిన్ మలీట్, కొడైన్ లు కలిగిన కోరెక్స్ దగ్గుమందు బ్రాండ్ ను వెంటనే బ్యాన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ సూచనలకు స్పందించిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ ఫిజర్.. తమ ఉత్పత్తుల్లోని కోరెక్స్ పంపిణీతో పాటు ఉత్పత్తిని నిలిపివేసినట్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు తెలిపింది.

మరిన్ని వార్తలు