కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. వృద్దుడు మృతి‌

1 Jul, 2020 11:49 IST|Sakshi

కశ్మీర్‌: కొద్ది సేపటి క్రితం వరకు తనతో పాటు నడుస్తూ.. కబుర్లు చెప్పిన తాత ఉన్నట్టుండి కింద పడిపోయాడు. ఎంత పిలిచినా పలకడం లేదు. పైగా తాత శరీరం నుంచి రక్తం వస్తుంది. ‘ఏమయ్యింది. లే తాత లే’ అంటూ మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఆ పసివాడిని చూసి ప్రతి ఒక్కరు అయ్యో అంటున్నారు. ఈ హృదయ విదారక సంఘటన సోపూర్‌లో చోటు చేసుకుంది. భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య  జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ 60 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఈ సంగతి తెలియని అతడి మూడేళ్ల మనవడు తాత కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. వివరాలు.. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో  బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ముష్కరులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువైపులా కాల్పులు జరుగుతున్నాయి. (‘కశ్మీర్‌ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లం’)

ఆ సమయంలో సదరు పిల్లాడు, అతడి తాత అక్కడి నుంచి వెళ్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఎదురుకాల్పుల్లో పిల్లాడి తాతకు రెండు బుల్లెట్లు తగిలాయి. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పాపం ఏం జరిగిందో తెలీని ఆ పసివాడు.. అంతసేపు తనకు కబుర్లు చెప్పిన తాత ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉండటం.. శరీరం నుంచి రక్తం రావడంతో భయపడ్డాడు. అక్కడే కూర్చుని ఏడవడం ప్రారంభించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ చిన్నారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి.

వీటిల్లో ఒక దాంట్లో సదరు పసివాడు చనిపోయిన తన తాతను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుండగా.. మరొక దాంట్లో గోడ వెనక దాక్కున్న సైనికుడు ఒకరు ఆ పపసివాడిని అక్కడి నుంచి పక్కకు వెళ‍్లమని చెప్పడంతో.. ఆ ప్రదేశం నుంచి నడుచుకుంటూ వెళ్తోన్న పిల్లాడి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎదురుకాల్పుల్లో వృద్ధుడితో పాటు ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.(కశ్మీర్‌ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్‌ అవార్డు)

మరిన్ని వార్తలు