‘గుండె’లదిరే వేగం

4 Sep, 2014 01:56 IST|Sakshi
ప్రత్యేకమైన బాక్స్ లో గుండెను భద్రపరిచి తీసుకెళుతున్న వైద్య సిబ్బంది

బెంగళూరు నుంచి చెన్నైకి గుండె తరలింపు
సాక్షి, చెన్నై/బెంగళూరు: భారత వైద్య రంగంలో ఓ అరుదైన ఘటన బుధవారం ఆవిష్కృతమైంది. చెన్నైలోని అడయార్ ఫోర్టిస్ ఆస్పత్రిలో కొన ప్రాణంతో ఓ గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలంటే వెంటనే గుండె మార్పిడి చేయాలి. ఇందుకోసం బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ(32) నుంచి సేకరించిన గుండెను తీసుకుని వైద్య బృందం మధ్యాహ్నం 3.30 గంటలకు వేగంగా విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో 4.25 గంటలకు(మొత్తం 55నిమిషాలు) చెన్నై విమానాశ్రయానికి రాగా, అక్కడి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 4.37 గంటలకు చేరుకుంది. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స ప్రారంభించారు. అందరి ప్రయత్నాలు, ప్రార్థనలు ఫలించి చివరికి 40 ఏళ్ల రోగి ప్రాణం నిలబడింది. గుండె మార్పిడి చికిత్స విజయవంతం అయినట్లు ఫోర్టిస్ ఆసత్ప్రి ఫ్యాకల్టీ డెరైక్టర్ హరీష్‌మణియన్ ప్రకటించారు.
 
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో ‘వేగం’ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. గుండె ను దాత నుంచి సేకరించిన తర్వాత 6 గంటల్లోపే తిరిగి అమర్చాలి. రసాయనాల సాయంతో ఆరు గంటలు మాత్రమే అది నిల్వ ఉంటుంది. ఈ నేపథ్యంలో దాత నుంచి గుండెను సేకరించడం దగ్గర నుంచి రోగికి అమర్చే వరకు సుదీర్ఘమైన ప్రక్రియ ను నిర్ణీత సమయంలోనే అందరి సహకారంతో పూర్తి చేయగలిగారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య గుండెను అత్యంత వేగంగా తరలించడంలో ట్రాఫిక్ పోలీసుల సంపూర్ణ సహకారం, ప్రజల తోడ్పాటు కూడా మరువలేనిది.

అత్యంత ప్రముఖుల(వీవీఐపీ)కు మాత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేసి మార్గాన్ని సుగమం చేసే పోలీసులు... ఇక్కడ మాత్రం ఓ సామాన్యుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు తమవంతు పూర్తి సహకారం అందించారు. బెంగళూరులో బీజీఎస్ ఆస్పత్రి నుంచి స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న దూరం 42 కిలోమీటర్లు. సాధారణంగా అయితే ఈ దూరాన్ని అధిగమించడానికి గంటన్నర పడుతుంది. కానీ, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఎక్కడివక్కడ నిలిపివేయడంతో... కేవలం 40 నిమిషాల్లోనే వైద్య బృందం విమానాశ్రయానికి చేరుకోగలిగింది.

అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైద్య బృందం చెన్నై విమానాశ్రయంలో దిగింది. బెంగళూరు పోలీసుల వలే చెన్నై నగర ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాలను పూర్తిగా నియంత్రించి దారిని క్లియర్ చేయడంతో... విమానాశ్రయం నుంచి అడయార్ ఫోర్టిస్ ఆస్పత్రి వరకు 14 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లోనే అంబులెన్స్ అధిగమించగలిగింది. సాధారణంగా అయితే, ఇందుకు 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీనికితోడు వైద్యుల కృషి వెరసి శస్త్రచికిత్స విజయవంతం అయింది. గతంలో ఒకే నగరంలోని రెండు వేర్వేరు ఆస్పత్రుల మధ్య గుండెను తరలించిన సందర్భా లు ఉన్నాయి. కానీ, రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య గుండెను తరలించడమనేది చాలా అరుదు.
 
‘‘ఎనిమిది మంది వైద్య నిపుణులు కాలంతో పరుగులు తీసి నాలుగు గంటల్లోనే రోగికి గుండెను అమర్చారు. ఆపరేషన్ విజయవంతమయింది’’
 - హరీష్, ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి డెరైక్టర్, చెన్నై
 ‘‘గుండె మార్పిడి తర్వాత రోగి 20 ఏళ్ల పాటు ఆరోగ్యంతో జీవించవచ్చు’’.
 - ఎన్.కె. వెంకటరామన్, వైస్ ప్రెసిడెంట్, బీజీఎస్ ఆస్పత్రి, బెంగళూరు

మరిన్ని వార్తలు