అంతులేని విషాదంగా మారిన వీడియో

9 Jul, 2019 20:53 IST|Sakshi

డెహ్రాడూన్‌: నందాదేవి పర్వతారోహణకు వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్నవారి చివరి వీడియోను ఇండో టిబెటన్‌ పోలీసులు మంగళవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో చివరికి విషాదంగా మారింది. సాయంత్రం సూర్యుడు మంచును ముద్దాడుతున్నట్టుగా మనోహరంగా కనిపించే దృశ్యంతో ప్రారంభమవుతుందీ వీడియో. ఇందులో ఎనిమిది మంది సభ్యులు మంచుతో కప్పబడ్డ పర్వతంపై శిఖరాన్ని అధిరోహించడానికి తాడు సహాయంతో ఒకరివెంట ఒకరు నడుస్తున్నారు. చివరిగా నడుస్తున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వినిపించడంతో వీడియో ఆగిపోతుంది. ఈ శబ్దాన్ని హిమపాతం లేదా మంచు తుపానుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హిమపాతం వల్లే వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

హిమాలయ శ్రేణుల్లో అత్యంత కష్టతరమైన పర్వతాల్లో ఒకటైన నందాదేవి శిఖరాన్ని అధిరోహించటానికి ఎనిమిది మంది సభ్యులు పూనుకున్నారు. వీరిలో ఏడుగురు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌కు చెందిన వారు కాగా మరొకరు ఇండియన్‌ మౌంటనీరింగ్‌ ఫౌండేషన్‌ అధికారి. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌ జిల్లాలో మే 13న మున్సారీ నుంచి పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మే 25 నుంచి ఈ బృందం కనిపించకుండా పోయింది. వారిని గుర్తించటం కోసం పర్వత యుద్ధాలకు శిక్షణ పొందిన డేర్‌డెవిల్స్‌ బృందం ఆపరేషన్‌ చేపట్టింది. దీనికోసం 500 గంటలు అంటే సుమారు 15 రోజులు శ్రమించి జూలై 3న భూమికి 19 వేల అడుగుల ఎత్తులో మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను పితోరాఘర్‌కు తరలించారు. మృతదేహాలు లభ్యమైన ప్రదేశంలో ఒక కెమెరా కూడా లభించింది. ఇందులోని వీడియోను ఇండో టిబెటన్‌ పోలీసులు వారి ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు.

మరిన్ని వార్తలు