కేరళ రాజకీయాల్లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ ప్రకంపనలు

8 Jul, 2020 14:43 IST|Sakshi

నేరస్తులపై కఠిన చర్యలు: యూఏఈ

తిరువనంతపురం: కేరళలో వెలుగుచూసిన గోల్డ్‌ స్మగ్లింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు యూఏఈ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారతదేశంలో యూఏఈ మిషన్‌ ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించింది. ఇదే కాక ఈ కేసు గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను విధుల నుంచి తొలగించారు. (గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు : ప్రిన్సిపల్‌ కార్యదర్శిపై వేటు)

గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగిని స్వప్న సురేష్‌కు, శివశంకర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష నాయకుడు రమేష్‌ చెన్నితాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి రాసిన లేఖలో ఆరోపించారు. అంతేకాక సీఎం రాజీనామా చేయాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశారు. అయితే కేరళ సీఎం కార్యాలయం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలు..

1. ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30కిలోల బంగారం ఎయిర్ పోర్టులో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్‌ కుమార్‌ను సోమవారం అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. 

2. ఈ కేసులో మరో మహిళకు కూడా సంబంధం ఉన్నట్లు అధికారులకు తెలిసింది. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని అయిన స్వప్న సురేష్ పాత్రపై అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళ ఐటీ శాఖలో ఉద్యోగినిగా పని చేస్తున్న స్వప్న సురేష్‌ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు స్వప్నను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందటే ఆమెను ఐటీ శాఖ నుంచి తొలగించారు.

3. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు యూఏఈ రాయబార కార్యాలయం ట్వీట్‌ చేసింది. యూఏఈ కాన్సులేట్‌ చిరునామాకు బంగారం ఉన్న కార్గో ఎవరు పంపిచారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అంతేకాక ‘నేరస్థులు పెద్ద నేరానికి పాల్పడటమే కాక భారతదేశంలో యూఏఈ మిషన్‌ ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. వారిని కఠినంగా శిక్షిస్తాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భారతీయ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తాం’ అంటూ యూఏఈ రాయబార కార్యాలయం వరుస ట్వీట్లు చేసింది.

4. ఈ కేసుతో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను సీఎం పినరయి విజయన్‌ ఖండించారు. కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ‘తిరువనంతపురం బంగారం స్మగ్లింగ్‌ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఆ పార్శల్‌  ప్రభుత్వ శాఖల నుంచి రాలేదు. అది యూఏఈ కాన్సులేట్‌ నుంచి వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది’ అంటూ పినరయి విజయన్‌ ప్రశ్నించారు.

5. బంగారం స్మగ్లింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల కోరారు. యూఏఈ కాన్సులేట్‌ దౌత్యపరమైన అధికారాలను దుర్వినియోగం చేశారంటూ ఆరోపిస్తూ ప్రధాని కార్యాలయానికి ఆయన లేఖ రాశారు.

6. ‘ఈ స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలైన శ్రీమతి స్వప్నా సురేష్‌ను కేరళ ప్రభుత్వం నియమించింది. ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన ఇంటిలిజెన్స్‌ నివేదికలను ప్రభుత్వం పట్టించుకోలేదు. కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఆమెపై దర్యాప్తు చేయలేదు’ అని రమేష్‌ తన లేఖలో  పేర్కొన్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే.. ఆమెకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయంతో ఎలాంటి సంబంధాలు  ఉన్నాయో అర్థమవుతుంది అన్నారు రమేష్‌.

7. ఈ అంశం గురించి మొదట మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అంతేకాక సదరు మహిళను కాపాడటానికి సీఎంఓ కార్యాలయం నుంచి ఎందుకు ఫోన్లు వెళ్లాయి. గతంలో ఆమె మీద ఉన్న కేసులను పట్టించుకోకుండా ఆమెను ఎందుకు ఐటీశాఖలో నియమించారు అని సురేంద్రన్‌ ప్రశ్నించారు. అంతేకాక కేరళ సీఎం ఐటీ సెక్రటరీ కాల్‌ లిస్ట్‌ను పరిశీలిస్తే.. అన్ని వివరాలు తెలుస్తాయన్నారు.

8. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ కేసుకు సంబంధించి తమ ప్రభుత్వం ఎవరిని రక్షించడానికి ప్రయత్నించడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా పని చేస్తుందో ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. 

9. ఎం. శివశంకర్‌ని ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ పదవి నుంచి తొలగించి సుదీర్ఘ సెలవు మీద పంపారు. ఆయన స్థానంలో ప్రభుత్వం నూతన ఐటీ సెక్రటరీని నియమించింది.

10. అసలే కరోనాతో సతమతమవుతోన్న సమయంలో ఈ కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని లేవదీసింది.

మరిన్ని వార్తలు