నాలుగు రెట్లు పెరగనున్న భూతాపం

24 Jun, 2020 18:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1901 నుంచి 1918 మధ్య భారత్‌లో వాతావరణ ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్‌ పెరగ్గా, 2,100 సంవత్సరాంతానికి దేశంలో ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్, అంటే ఇప్పటి కంటే నాలుగింతలు పెరగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 1976 నుంచి 2005 వరకు 30 ఏళ్ల కాలంలో పెరిగిన సగటు ఉష్ణోగ్రతకు ఈ పెరగనున్న ఉష్ణోగ్రత సమానమని, కర్బణ ఉద్ఘారాల కారణంగానే ఉష్ణోగ్రత పెరుగుతోందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. 

‘అసిస్మెంట్‌ ఆఫ్‌ క్లైమేట్‌ చేంజ్‌ ఒవరి ది ఇండియన్‌ రీజియన్‌’ పేరిట కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పులపై నివేదికను విడుదల చేసింది. దేశ ఉష్ణోగ్రత దాదాపు నాలుగు డిగ్రీలు పెరగడమంటే వడగాలులు కూడా నాలుగింతలు పెరగడమే. ఇది పర్యావరణ సమతౌల్యంపైనే కాకుండా వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నీటి వనరులు బాగా తరగిపోతాయి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పడిపోతాయి. పర్యవసానంగా జీవ వైవిధ్యంపై ప్రభావంతోపాటు ఆహారం కొరత ఏర్పడుతుంది. తద్వారా ప్రజారోగ్యం దెబ్బతింటుంది. 

ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రకాల మొక్కలు, జంతువులు నశించి పోతున్నాయని, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇవి మరింత వేగంగా నశించిపోయే ఆస్కారం ఉందని నివేదికలో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మీద భూ ఉష్ణోగ్రత సరాసరి మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్‌ పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను రెండు డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని 2015లో పారిస్‌లో కుదర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లెక్కన ఆ లక్ష్య సాధనలో ప్రపంచ దేశాలు విఫలమైనట్లే. 

మరిన్ని వార్తలు