అక్కడ బయటికి వస్తే అంతే..

17 Jun, 2019 17:19 IST|Sakshi

పట్నా : ఉత్తరాదిలో భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. బిహార్‌లో వేసవి తాపానికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. వడగాడ్పులతో బిహార్‌లో ఇప్పటివరకూ 117 మంది మరణించారు. మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో గయ జిల్లాలో మేజిస్ర్టేట్‌ అభిషేక్‌ సింగ్‌ 144 సెక్షన్‌ విధించారు.

ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇండ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ సమయంలో నిర్మాణ పనులపై కూడా జిల్లా యంత్రంగా నిషేధం విధించింది. ఇక గత 48 గంటల్లో కేవలం ఔరంగాబాద్‌లో 60 మంది మరణించగా, ముంగర్‌లో అయిదుగురు మృత్యువాతన పడ్డారు. గయంలో వడగాడ్పులకు 35 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

ఎండ తీవ్రతతో ఉపాధి పనుల సమయాలను కూడా సవరించారు. ఉదయం 10.30 గంటల తర్వాత ఎలాంటి పనులు చేపట్టరాదని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు సెలవలను ఈనెల 22 వరకూ పొడిగించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం అందచేయనున్నట్టు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. అత్యవసర పనులైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని, ఎండబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు