మూడు రోజుల సెలవులు.. బ్యాంకులు కిటకిట

13 Dec, 2016 14:01 IST|Sakshi
మూడు రోజుల సెలవులు.. బ్యాంకులు కిటకిట
వరుసపెట్టి మూడు రోజులు సెలవులు వచ్చి, మళ్లీ బ్యాంకులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా ఏటీఎంలు, బ్యాంకులు కిటకిటలాడిపోయాయి. ఒక్కో బ్యాంకు వద్ద వేలాది సంఖ్యలోజనం గుమిగూడారు. టోకెన్ల పద్ధతి అమలుచేసినా, ఆ టోకెన్ల కోసం కూడా కొట్టుకునే పరిస్థితి చాలాచోట్ల కనిపించింది. ఏటీఎంలలో డబ్బులు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా ఖాళీ అయిపోయాయి. రెండో శనివారం, ఆదివారంతో పాటు సోమవారం నాడు మిలాద్ ఉన్ నబీ సెలవు కూడా రావడంతో బ్యాంకులు, ఏటీఎంలు పూర్తిగా మూగబోయాయి. దీంతో అసలే నోట్లు దొరక్క అల్లాడుతున్న జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లయింది. 
 
మూడు రోజుల సెలవుల తర్వాత బ్యాంకుల వద్దకు వస్తే నోక్యాష్ అనే బోర్డులు కనిపించటంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న పరిస్థితిలో మార్పు లేకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో హయత్‌నగర్‌లోని ఆంధ్రాబ్యాంకు సిబ్బందితో ఖాతాదారులు వాగ్వాదానికి దిగారు. ఎల్బీనగర్‌లోని ఎస్‌బీహెచ్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. నోట్లు లేవని సిబ్బంది చెప్పటంతో వారితో వాగ్వాదానికి దిగారు. నగరంలోని అన్ని బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.