భయపెడుతున్న బియాస్.. 28కి చేరిన మృతులు

19 Aug, 2019 10:22 IST|Sakshi

హిమాచల్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు

సిమ్లా: గత కొద్దిరోజులుగా దక్షిణాదిని వణికిస్తోన్న వరదలు ఇప్పుడు ఉత్తర భారతంపై ప్రతాపాన్ని చూపుతున్నాయి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 28 మంది మరణించగా.. 22 మందిగల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి.పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా యమున, సట్లెజ్, బియాస్ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా సోమవారం నాటికి 27 మంది మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.490 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు అందించేందుకు రావాల్సిందిగా జాతీయ విపత్తుల సహాయ బృందాలను కోరినట్లు తెలిపారు. షిమ్లాలో 9 మంది, సోలన్‌ జిల్లాలో 5 మంది, కుల్లు, సిర్మావూర్, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో షిమ్లా, కుల్లు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలన్నీ సోమవారం మూసి ఉంచాలని ఆ జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినగా, మరి కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడుతుండడంతో ఈ ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్‌ అమిత్‌ కశ్యప్‌ అన్నారు.

మరిన్ని వార్తలు