అధికార పార్టీ నేత ఇంట్లోకి వరదనీరు

29 Sep, 2019 16:26 IST|Sakshi

భారీ వర్షాలు.. యూపీ, బిహార్‌ అతలాకుతలం

లక్నో, పట్నా: భారీ వర్షాలు, వరదలతో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ అతలాకుతలం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల్లో 80మంది చనిపోయారు. కుంభవృష్టి బిహార్‌ను ముంచెత్తుతోంది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు, ఆఫీస్‌లు, హాస్పిటల్స్‌, విద్యాసంస్థలు అన్నింటినీ వరదనీరు ముంచెత్తింది. రెండు వేరువేరు ఘటనల్లో ఏడుగురు చనిపోవడంతో.. రాష్ట్రంలో వర్ష మృతుల సంఖ్య 17కు పెరిగింది. భగల్‌పూర్‌లో గోడకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖగౌల్‌లో ఆటోపై చెట్టు కూలడంతో నలుగురు మృతి చెందారు. ఇక, భారీవర్షాలతో బిహార్‌ రాజధాని పాట్నా సహా అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. పాట్నాలో అధికార పార్టీ జేడీయూ నేత అజయ్‌ అలోక్‌ ఇంట్లోకి నీళ్లు చేరాయి. బెడ్‌రూమ్‌, హాల్‌ సహా  ఇల్లంతా వర్షపు నీటితో నిండిపోయింది.

15 జిల్లాల్లో అధికారులు రెడ్‌అలర్ట్‌
భారీ వరదలతో జనజీవనం స్తంభించగా బిహార్‌లోని15 జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. మధుబని, సపౌల్‌, అరరియ, కిషన్‌గంజ్‌, ముజఫర్‌పూర్‌, బంకా, సమస్తిపూర్‌, మధేపుర, సహస, పుర్నియ, దర్భంగ, భాగల్పూర్‌, ఖగారియా, కతిహార్‌, వైశాలి సహా మొత్తం 15 జిల్లాల్లో అధికారులు రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. తూర్పూ చంపరన్‌, శివ్‌హర్‌, బెగుసరై, సీతామర్హి, సరన్‌, సివన్‌ ప్రాంతాల్లోనూ వరద తాకిడి అధికంగా ఉంది. పీకల్లోతు నీళ్లల్లోనే 20 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోనూ దయనీయ పరిస్థితి
అటు ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది, భారీవర్షాలకు ఒక్క యూపీలోనే 50 మందివరకూ చనిపోయారు. రాష్ట్ర తూర్పుభాగంలోని జిల్లాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. ఈ ఏడాదిలోనే అత్యధికంగా గడిచిన 24 గంటల్లో ప్రయాగరాజ్‌లో 102.2 మిల్లీమీటర్లు, వారణాసిలో 84.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. లక్నో, అమేఠీ, హర్దోయ్ సహా పలు జిల్లాల్లో వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. కాగా రాగల 24 గంటల్లో బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిపై బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు.

మరిన్ని వార్తలు