చెన్నై జలమయం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు!

31 Oct, 2017 19:35 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో తమిళనాట పది జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి  చెన్నై, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత అనుభవాల నేపథ్యంలో తాజా వర్షం  ప్రజల్ని వణికించింది. 2015 డిసెంబరులో ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కురిసిన వర్షాలతో చెన్నై జల దిగ్బంధంలో చిక్కిన విషయం తెలిసిందే. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గత ఏడాది ఈశాన్య రుతు పవనాల రూపంలో వర్ధా తుఫాన్‌ ప్రళయతాండవం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో చెన్నై, శివారు వాసుల్లో ఆందోళన పెరిగింది.

సోమవారం ఉదయం నుంచి రుతు పవనాల ప్రభావం, బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరులతో పాటుగా పది జిల్లాల్లో వర్షాలు పడుతూ వస్తున్నాయి. సోమవారం రాత్రి వర్షం తీవ్రత మరి ఎక్కువ కావడంతో లోతటు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రాత్రికి రాత్రే అనేక లోతట్టు ప్రాంతాల్లోని జనం తమ ఇళ్లను వదలి పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.  మంగళవారం ఉదయాన్నే ఏ రోడ్డు చూసినా నదుల్ని తలపించేవిధంగా పరవళ్లు తొక్కాయి. చెన్నైలోని అనేక సబ్‌ వేలలో నీళ్లు చేరడంతో అటు వైపుగా వాహనాలు వెళ్ల లేని పరిస్థితి. చెన్నైలో యాభైకు పైగా ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రజల్లో భయందోళన పెరిగింది. మొత్తం 22 సబ్‌ వేలలో నీళ్లు చేరడం వంటి ప్రభావంతో చెన్నై రోడ్లు మీద వాహనాలు నత్తనడకన సాగాల్సి వచ్చింది. ఇక, గత అనుభవాలతో శివారుల్లోని చెరువులకు ముందుగా గండ్లు కొట్టడంతో అడయార్‌ నదిలో మరింతగా ఉధృతి పెరిగింది. రామాపురం, ఈక్కాడు తాంగల్‌, సైదా పేట మీదుగా అడయార్, కోట్టూరు పురం వైపుగా అడయార్‌ నదిలోనీటి ఉధృతి పెరిగింది. గతంలో ఈ నది ఉధృతే చెన్నై నగరాన్ని ముంచేసింది.

కాగా, మరో రెండు రోజుల పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలలోనే కాకుండా కడలూరు, విల్లుపురం, తంజావూరు, నాగపట్నం, పుదుకోటై, రామనాధపురం, తిరువారూర్, కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలిల్లోనూ భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో శీర్గాలిలో అత్యధికంగా 31 సె.మీ., చెన్నై తాంబరం, సెంబరబాక్కంలలో 18 సెం.మీ., మీనంబాక్కంలో 17 సెం.మీ., నుంగంబాక్కంలో 12 సెం.మీ. వర్షం పడింది. ఇక, పిడుగు పడి ఇద్దరు, గోడకూలి ఒకరు, విద్యుదాఘాతానికి మరో ఇద్దరు మరణించారు.

మరిన్ని వార్తలు