ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

24 Jul, 2019 11:32 IST|Sakshi

ముంబై : భారీ వర్షాల కారణంగా ముంబై నగరం సముద్రాన్ని తలపిస్తోంది. మంగళవారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురవడంతో నగరమంతా నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అయిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపిపోవడంతో  పనులకు వేళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

భారీ వర్షాలతో రైలు ప్రయాణానికి కూడా అంతరాయం ఏర్పడింది. నగరంలోని సియాన్‌ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది. భారీ వర్షం కారణంగా కుర్లా, సియాన్‌ ప్రాంతాలకు మధ్య ప్రయాణించే రైలు 15 నిమిషాల పాటు ఆలస్యంగా వస్తాయని రైల్వే సిబ్బంది పేర్కొంది. విమానయాన సేవలు యథాతదంగా కొనసాగుతున్నాయి. 

8మందికి తీవ్రగాయాలు
భారీ వర్షాల కారణంగా రహదారి కనిపించకపోవడంతో ముంబైలో బుధవారం ఉదయం మూడు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ముంబై, రాయగడ్, రత్నగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

మరో కొద్దిరోజులు ఇదే పరిస్థితి
ముంబైకి సమీపంలో తుపాను  ఏర్పాటు అవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గత రెండు రోజులుగా ముంబైలు వర్షాలు కురవలేదు. దీంతో కాస్త ఊపిరి తీసుకున్న నగర వాసులు.. బుధవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ఉలిక్కి పడ్డారు. ఈ నెల ప్రారంభంలో ముంబైలో కురిసిన భారీ వర్షాలకు మలాడ్‌లో ఓ గోడ కూలి 30 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు