దేశ రాజధానిలో భారీ వర్షాలు

22 Jan, 2019 13:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. గురుగ్రామ్‌, ఢిల్లీలోని కొన్నిచోట్ల మంగళవారం ఉదయం వడగళ్లు పడ్డాయి. దీంతో చలి మరింతగా పెరిగిపోయింది. గురుగ్రామ్‌తోపాటు దేశ రాజధాని ప్రాంతంలో పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి. నల్లటి మేఘాలు కమ్ముకోవడంతో ఉదయం 9గంటలు దాటినా  వెలుతురు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఆఫీసులు, స్కూల్స్‌, కాలేజీలకు వెళ్లేవారంతా ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా ఢిల్లీకి వెళ్లే 15 రైళ్లు ఆలస్యమైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 24 వరకూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీవర్షం కారణంగా నజఫ్‌గడ్‌లో ఒక గొడౌన్ గోడకూలి ఇద్దరు మృతి చెందారు.

మరిన్ని వార్తలు