ఉత్తరాదిపై ఉరిమిన తుపాను

30 May, 2018 02:42 IST|Sakshi
యూపీలోని ఉన్నావ్‌లో ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్టు

54 మంది మృతి

వర్షాలు, పిడుగుపాట్లు, పెనుగాలుల బీభత్సం

బిహార్, యూపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లపై ప్రభావం

పట్నా/లక్నో: ఉత్తరాది రాష్ట్రాలపై ప్రకృతి కన్నెర్ర చేసింది. భారీ వర్షాలు, పిడుగుపాట్లు, పెనుగాలులు బిహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో బీభత్సం సృష్టించాయి. ఈ 4 రాష్ట్రాలో 54 మంది మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో చెట్లు కూలకూలాయి. ఇళ్లు, గుడిసెలు నేలమట్టమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి తుపాను తీవ్రరూపం దాల్చింది. బిహార్‌లో 19 మంది, ఉత్తరప్రదేశ్‌లో 17 మంది, జార్ఖండ్‌లో 12 మంది, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు చొప్పున చనిపోయారు. ఈ నెలలో అకాల వర్షాలకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 290కి చేరింది.

బిహార్‌లో బెంబేలెత్తించిన పిడుగులు..
తుపాను ప్రభావం అధికంగా ఉన్న బిహార్‌లో గంటకు 70 కి.మీ.కు పైగా వేగంతో పెనుగాలులు వీచాయి. గయ, ఔరంగాబాద్‌ జిల్లాల్లో సోమవారం రాత్రి ఐదుగురు చొప్పున మృతిచెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఇంకా ముంగర్, కతియార్, నవాడా జిల్లాల్లోనూ ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌లో పిడుగుపాటుకు మృతిచెందినవారిలో ఇద్దరు మహిళలున్నారు. గయలో ఇంటి పైకప్పులు, చెట్లు కూలిపోవడంతో మరణించినవారిలో ఇద్దరు మహిళలు, బాలుడు, బాలిక ఉన్నారు. ఇదే జిల్లాలో ఇద్దరు బాలికలు, బాలుడు గాయపడ్డారు. ముంగర్‌లో పిడుగుపాటుకు ముగ్గురు పిల్లలు సహా నలుగురు చనిపోయారు. నవాడా జిల్లాలో పిడుగుపాటు 16 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల వ్యక్తిని బలితీసుకుంది. కతియార్‌లో విరిగిపడిన చెట్టు కింద నలిగి 70 ఏళ్ల వృద్ధుడు, 11 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల మహిళ మరణించారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.     

యూపీలో 17 మంది మృత్యువాత..
యూపీలో 17 మంది మృతిచెందగా, మరో 10 మంది గాయపడినట్లు సీనియర్‌ అధికారి చెప్పారు. అందులో ఉన్నావ్‌లో ఆరుగురు పిడుగుపాటు, వర్షానికి బలికాగా, రాయ్‌బరేలీలో ముగ్గురు, కాన్పూర్, పిలిబిత్, గోండా జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించినట్లు తెలిపారు. తుపాను ధాటికి రాయ్‌బరేలీ, ఉన్నావ్‌ జిల్లాల్లో పలు గుడిసెలు నేలకూలినట్లు చెప్పారు. హర్దోయ్‌–ఉన్నావ్‌ రహదారిపై చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బాధితులకు సాధ్యమైనంత త్వరగా ఉపశమనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు ప్రిన్సిపల్‌ కార్యదర్శి(సమాచార శాఖ) అవినాశ్‌ అవస్తి తెలిపారు. మరోవైపు, పశ్చిమబెంగాల్‌లోని మాల్డా జిల్లాలోనూ భీకర గాలులకు ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.

కర్ణాటకలో బీభత్సం
మంగళూరు: కర్ణాటకలోని పలు ప్రాంతాలను మంగళవారం వర్షాలు ముంచెత్తాయి. దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో వరుసగా మూడోరోజూ భారీ వర్షాలు కురవడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. మంగళూరులో పరిస్థితిని సమీక్షించామనీ, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) నుంచి అదనపు బృందాలను అక్కడకు పంపుతున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మంగళూరు నగరంలో వర్షం కురిసిందనీ, అనేక ప్రాంతాల్లో భవనాలు సగం వరకు మునిగాయని అధికారులు చెప్పారు. ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. పాఠశాలలో చిక్కుకున్న పిల్లలను పడవల సాయంతో సిబ్బంది కాపాడారు. వందకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి.

        మంగళూరులో వరద ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలిస్తున్న సిబ్బంది

మరిన్ని వార్తలు