తమిళనాడుని వణికించిన వాన

29 Nov, 2019 10:37 IST|Sakshi

తాంబరంలో ఒకే రాత్రి 14 సెం.మీ వర్షం 

జలదిగ్బంధంలో రోడ్లు 

గుణపాఠం నేర్వని అధికారులు 

మరో మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం

విద్యాలయాలకు సెలవు ప్రకటించిన ఆయా జిల్లాల కలెక్టర్లు

సాక్షి, చెన్నై : బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకు తాంబరం పరిసరవాసుల్ని వర్షం వణికించింది. ఒక్క రాత్రిపూటే ఏకంగా 14 సెం.మీ వర్షం కురవడంతో రోడ్లు జలదిగ్భందంలో చిక్కాయి. గతంలో ఇక్కడ నెలకొన్న పరిణామాలతో అధికారులు ఇంకా గుణపాఠం నేర్వక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 డిసెంబరులో ఈశాన్య రుతు పవనాలు చెన్నై మీద తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.

నీట మునిగిన తాంబరం సమీపంలోని సబ్‌ వే  

ప్రధానంగా తాంబరం పరిసరాల్లో ఒకే రాత్రి 20 సెం.మీకి పైగా వర్షం పడటంతో ఇక్కడి చెరువులు తెగి ఆ నీళ్లు అడయార్‌లోకి ఉధృతంగా ప్రవహించడంతో చెన్నై నీట మునిగింది. కాంచీపురం జిల్లా, ప్రస్తుత చెంగల్పట్టు జిల్లా పరిధిలోని తాంబరం, ముడిచ్చూరు, వరదరాజపురం, మణివాక్కం, ఆలందూరు, మణిమంగళం, ఊరపాక్కం, గూడువాంజేరి ప్రాంతాల్లోని చెరువులన్నీ తెగడం కారణంగానే చెన్నై జలదిగ్భంధంలో చిక్కుకుని పది రోజుల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారు.

ట్రాఫిక్‌ జామ్‌ 

అలాగే, పెరుంగళత్తూరు, సేలయూరు, పళ్లికరణై , పెరుంగుడి పరిసరాల్లోని చెరువుల రూపంలో ఆ పరిసరాలన్నీ కొన్ని రోజుల పాటు నీట మునగాల్సిన పరిస్థితి. దీంతో అడయార్‌ తీరంతో పాటు నీటి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు మీద ప్రత్యేక దృష్టి పెట్టినా, అధికారులు ఆ తదుపరి యథారాజ తథాప్రజా అన్న చందంగా వ్యవహరించడం మొదలెట్టారు. గతంలో చోటుచేసుకున్న పరిణామాలతో అధికారులు ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని బుధవారం రాత్రి తాంబరం పరిసరాల్లో కురిసిన వర్షంతో వెల్లడైంది.
 
కుండపోతగా వాన.. 
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో మోస్తారుగా వర్షం పడ్డా, చెన్నైలో అంతంత మాత్రమే. చెన్నై శివారుల్లో కొంత మేరకు అప్పుడప్పుడు వర్షం పలకరిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో బుధవారం అర్థరాత్రి కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, పిడుగు పాటులతో ఆ ప్రాంతం దద్దరిళ్లింది. వర్షం ధాటికి కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల కలెక్టర్లు ఉదయాన్నే విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.

రోడ్డుపై చేరిన నీరు

ఈ రెండు జిల్లా పరిధిలోని శ్రీపెరంబదూరు, వాలాజాబాద్, తిరుప్పోరూర్, ఉత్తర మేరు, మహాబలిపురం, గూడువాంజేరి, పరిసరాల్లో భారీ వర్షం పడింది. అయితే, తాంబరం పరిసరాల్లో ఏకంగా 14.6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షం కారణంగా తాంబరం – ముడిచ్చూరు మార్గం జలమయమైంది. తాంబరం – వేళచ్చేరి మార్గంలో సేలయూరు వద్ద రోడ్డు మీద వరద పారాయి. వాహనాలు ముందుకు సాగలేని పరిస్థితి. అన్ని రోడ్లు జలమయం కావడంతో పాటుగా రైల్వే సబ్‌వేలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తాయి. ఇక, అడయార్‌లో నీటి ప్రవాహం పెరిగింది. 

వాహనదారుల ఇక్కట్లు

కొన్ని చోట్ల ఇళ్లల్లోకి సైతం నీళ్లు చొరబడటంతో అక్కడి ప్రజలు అధికారుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త కాలువల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగి ఉండటంతో నీళ్లు బయటకు వెళ్ల లేని పరిస్థితి. పది గంటల తదుపరి అధికార వర్గాలు రంగంలోకి దిగి, నీటిని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అంత వరకు ఆయా మార్గాల్లో ప్రయాణం గగనంగా మారింది. ఇక, వేలూరు జిల్లా పరిధిలో అనేక చోట్ల భారీ వర్షం ధాటికి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కొన్ని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలను యాజమాన్యాలు వాయిదా వేశాయి. 

మరో మూడు రోజుల వాన.... 
చెన్నైలోని ట్రిప్లికేన్, పురసైవాక్కం, విల్లివాక్కం, ఎగ్మూర్, టీ.నగర్, వడపళని, అంబత్తూరు, ఆవడి ప్రాంతాల్లో కాసేపు వర్షం పలకరించింది. ఈశాన్య రుతు పవనాలు మరింత బలపడే అవకాశాలతో మరోమూడు రోజుల పాటుగా అక్కడక్కడ భారీగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో మోస్తారుగా వర్షం పడుతుందని, ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీగా వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం సమాచారంతో అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. 2015లో ఇదే తరహాలో నవంబర్‌ చివర్లో భారీ వర్షం పడటం, డిసెంబరు 1, 2 తేదీల్లో రాత్రికి రాత్రే కురిసిన వర్షాలతో చెన్నై నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో వర్షం పడే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.  

మరిన్ని వార్తలు