లాక్‌డౌన్‌ 4.0 : భారీగా ట్రాఫిక్‌ జామ్‌

18 May, 2020 14:05 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ-నోయిడా సరిహద్దులో సోమవారం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నేటి నుంచి ప్రారంభమైన నాలుగో విడత లాక్‌డౌన్‌లో భాగంగా పలు సడలింపులు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోపక్క చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించడం కూడా ఇందుకు కారణమయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు జారీచేశారు. 

ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నోయిడా డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఈ-పాస్‌లు ఉన్నవారినే మాత్రమే నోయిడాలోకి అనుమతిస్తున్నారని తెలిపారు. కలిండి కుంజ్‌ బ్యారేజ్‌ ఫ్లైఓవర్‌, డీఎన్‌డీ ఫ్లై ఓవర్‌ ద్వారా ప్రయాణం చేయాలని అనుకునేవారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కాగా, లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ఆదివారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా షాపులు, మార్కెట్‌లు, కార్యాలయాలు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతించింది. ఒకవేళ అవసరమనుకుంటే రాష్ట్రాలు అదనపు అంక్షలు విధించుకోవచ్చని తెలిపింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మాత్రం ఈ సడలింపులు ఉండబోవని స్పష్టం చేసింది. (చదవండి : లాక్‌డౌన్‌ : కేంద్రం కీలక ఆదేశాలు)

మరిన్ని వార్తలు