'డియర్‌ జైట్లీ.. దమ్ముంటే నాపై దావా వేయ్‌'

21 Dec, 2015 17:10 IST|Sakshi
'డియర్‌ జైట్లీ.. దమ్ముంటే నాపై దావా వేయ్‌'

న్యూఢిల్లీ: డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై బీజేపీ ఎంపీ మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత పార్టీకి చెందిన అగ్రనేత అయిన జైట్లీకి ఆయన బహిరంగ సవాల్‌ విసిరారు. జైట్లీ తనపై కూడా పరువునష్టం దావా వేయాలని పేర్కొన్నారు. 13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం మీద అరుణ్‌జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే జైట్లీపై పరోక్ష విమర్శలు చేసిన కీర్తి ఆజాద్‌.. తాజాగా ఆయనపై బహిరంగంగా ట్వీట్ల యుద్ధానికి తెరలేపారు.

'హాల్లో డియర్‌ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్‌ నా మీద కూడా వేయ్‌. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్‌ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్‌ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది. నాపై కూడా కేసు పెట్టండి' అని పేర్కొన్నారు. జైట్లీపై తన ట్లీట్ల గురించి ప్రస్తావించగా.. 'కృష్ణుడు బాలుడిగా ఉన్నప్పుడే కాళియ సర్పంతో పోరాడాడు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కృష్ణుడు ఎవరో, కాళియుడు ఎవరో మీరు వ్యాఖ్యానించాలి' అని కీర్తి ఆజాద్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు