మరాఠ్వాడా రైతులను ఆదుకోండి

25 Nov, 2014 22:43 IST|Sakshi

 సాక్షి, ముంబై: మరాఠ్వాడాలో కరువు కరాళనృత్యం చేస్తోందని, రైతుల పరిస్థితి దైన్యంగా మారిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. మరాఠ్వాడా పర్యటనలో చివరి రోజైన మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరాఠ్వాడాలో కరువు పరిస్థితి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని చెప్పారు. పశువులకు కనీసం గ్రాసం కూడా దొరకడంలేదన్నారు. ఈ ఏడాది ఇక్కడ కేవలం 414 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని.. దాంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతుల నుంచి రుణ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

 మరాఠ్వాడా రైతులకు శివసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడి కరువు పరిస్థితిని గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అలాగే కొంకణ్‌లోని అదనపు నీటిని మరాఠ్వాడాకు తరలించవచ్చా.. అనే విషయంపై కూడా చర్చించాలని కోరతామన్నారు. ఇదిలా ఉండగా, రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేపై మరోసారి ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. ముందు అజిత్ పవార్ మాదిరిగా మాట్లాడిన ఆయన మంగళవారం శరద్ పవార్‌లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

 ఉద్ధవ్ వ్యాఖ్యలు పట్టించుకోను: ఖడ్సే
 వ్యవసాయం తెలియనివాళ్లు తనపై  చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనని రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే ధ్వజమెత్తారు.  పంటల గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు చురక అంటించారు. రైతులకు మొబైల్ ఫోన్ల బిల్లులు చెల్లించేందుకు డబ్బులుంటాయి.... కాని విద్యుత్ బిల్లులు ఎందుకు కట్టడం లేదని సోమవారం ఖడ్సే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఖడ్సేను ఉద్ధవ్ ఠాక్రే  హెచ్చరించారు.

 దీనిపై ఖడ్సే మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల గురించి తాను చెప్పిందాన్ని మీడియా వక్రీకరించిందని ఆరోపించారు.  మొబైల్ బిల్లు డబ్బును ఆదా చేసుకుని వాటిని విద్యుత్ బిల్లుకు వాడుకోవాలని చెప్పానే తప్ప వేరే వ్యాఖ్యలు చేయలేదన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో 10,11,12 తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కరువు ప్రాంతాల రైతులకు ప్రభుత్వం విద్యుత్ బిల్లుల్లో 33 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

 వారిద్దరూ ఒకటైతే మాకేంటి : శరద్‌పవార్
 శివసేన, బీజేపీలపై తనదైన శైలిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చురకంటించారు. శివసేన, బీజేపీలు ఒక్కటైతే ఎవరి మద్దతు అవసరం ఉండదన్నారు. ముఖ్యంగా బీజేపీకి శివసేన మద్దతు పలికినట్టయితే మందు తీసుకోకుండానే రోగం కుదిరినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో భాగంగా సాంగ్లీ జిల్లాలోని కరాడ్‌కి వచ్చిన శరద్ పవార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలా లేదా అనేది శివసేన, బీజేపీ అంతర్గత విషయమన్నారు. దాంతో తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. స్థిరప్రభుత్వం ఉండాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీకి ఎన్సీపీ బయటినుంచి మద్దతు పలికిందన్నారు.

మరిన్ని వార్తలు