ఈశాన్యవాసుల కోసం హెల్ప్‌లైన్

18 Oct, 2014 22:50 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ/గుర్గావ్: ఈశాన్య రాష్ట్రాల ప్రజలకోసం గుర్గావ్‌లో త్వరలో హెల్ప్‌లైన్ ను ప్రారంభిస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. నాగాలాండ్‌కు చెంది న ముగ్గురు యువకులపై బుధవారం దాడి జరిగిన నేపథ్యంలో గుర్గావ్‌లో శాంతిభ ద్రతల స్థితిగతులపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. దీంతోపాటు  ఈశాన్యప్రాంత విద్యార్థుల బృందం ప్రతినిధులను కూడా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ శివారు ప్రాంతాలతోపాటు గుర్గావ్‌లోనూ ఈశాన్యవాసులకోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తామన్నారు. ఇందుకు తాను ఆమోదం తెలిపానన్నారు. దేశ సమగ్రతకు  భంగం కలిగించే ఇటువంటి విద్వేషంతో కూడిన నేరాలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు.
 
 ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా బాధాకరమేన న్నారు. దాడి ఘటన తర్వాత గుర్గావ్ పోలీసులు చేపట్టిన చర్యలతో తాను సంతృప్తి చెందినట్లు ఆయన చెప్పారు. నిందితుల అరెస్టుయ్యారని, ఈశాన్య ప్రాంతవాసులపై దాడులు ఎక్కడ జరిగినా నిందితులను అరెస్టు చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. పోలీసు బలగాల్ని ప్రోత్సహించడం కోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.  కాగా గుర్గావ్‌లో నాగాలండ్‌కు చెందిన ఇద్దరు యువకులపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి విదితమే. అంతకు ముందు బెంగుళూరులో కూడా ఇటువంటి దాడి జరిగింది. కన్నడం మాట్లాడనందుకు మిజోరం యువకుడిపై దాడి చేశారు.
 
 దాడులు అమానుషం : ఆప్
 ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై గుర్గావ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు అమానుషమని ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం పేర్కొంది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఆప్‌తోపాటు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించారు. ఆప్  చీఫ్ అధికార ప్రతినిధి యోగేంద్ర యాదవ్ గుర్గావ్‌లోని సికిందర్‌పూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న విద్యార్థిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా ఉండాలని సికిందర్‌పూర్ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈశాన్యరాష్ట్ర విద్యార్థిపై ఇలాంటి దాడులు జరగడం అవమానకరమని, ఆప్ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి సంకుచిత వైఖరి వల్ల భారతీయ సమాజంలో విపరీత ధోరణులు చోటు చేసుకొంటాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు