ఢిల్లీలో నివసించనప్పుడు కాలుష్యం కోసం మాకెందుకు

20 Nov, 2019 18:13 IST|Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నవంబర్‌ 15న జరిగిన పార్లమెంట్‌ ప్యానెల్‌ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో నటి హేమమాలిని కూడా ఉన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు హేమమాలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నివసించని ఎంపీలే సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఎందుకంటే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి వాయు కాలుష్య నివారణపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ కాలుష్య తీవ్రత తక్కువగా ఉండే ముంబై వంటి నగరాల్లో నివసించేవారికి ఢిల్లీ కాలుష్యం గురించి పెద్దగా ఆసక్తి ఉండదన్నారు.

అందుకే వారు సమావేశానికి హాజరు కాలేదని పేర్కొన్నారు. బాధ్యత గల ఎంపీగా ఉండి ఢిల్లీ కాలుష్య నియంత్రణ సమావేశానికి గైర్హాజరవడమే కాక పట్టింపు లేనట్లుగా మాట్లాడటంపై ఢిల్లీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సమావేశానికి గైర్హాజరైన తూర్పు ఢిల్లీ ఎంపీ, క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం హేమమాలిని ఇంతటి తీవ్రమైన సమస్యను తేలికగా తీసిపారేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు