జార్ఖండ్‌ 11వ సీఎంగా హేమంత్‌

30 Dec, 2019 04:36 IST|Sakshi
ప్రమాణస్వీకార కార్యక్రమంలో సంఘీభావం తెలుపుతున్న డి.రాజా, స్టాలిన్, శరద్‌యాదవ్, మమతా బెనర్జీ, అశోక్‌ గహ్లోత్, రాహుల్‌ గాంధీ, హేమంత్, భూపేష్‌ బఘేల్, శిబూసోరెన్‌ తదితరులు

కేబినెట్‌ మంత్రులుగా మరో ముగ్గురు ప్రమాణ స్వీకారం

ప్రతిపక్ష పార్టీల నాయకులంతా హాజరు  

రాంచీ: జార్ఖండ్‌ 11వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నాయకుడు హేమంత్‌ సోరెన్‌ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష నాయకులు, కేంద్రంలో అధికార బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఎందరో తరలిరాగా అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. తెల్లరంగు కుర్తా పైజామా, ముదురు నీలం రంగు నెహ్రూ జాకెట్‌ ధరించి వచ్చిన 44 ఏళ్ల ఈ ఆదివాసీ నేత అందరినీ ఆకర్షించారు. గవర్నర్‌ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఆరు నెలలు తిరక్కముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడంతో విపక్షాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది.

జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారిలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌లు ఉన్నారు. విపక్షాల బలం పెరుగుతూ ఉండడంతో వీరంతా చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్‌ నాయకుడు అలంఘీర్‌ ఆలమ్, జార్ఖండ్‌ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్‌ ఒరాయన్, ఆర్‌జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.  

ప్రధాని అభినందనలు
జార్ఖండ్‌ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన సోరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తరఫు నుంచి వీలైనంత సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  

సీఎంగా రెండోసారి
జార్ఖండ్‌ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్‌ వారసుడిగా హేమంత్‌ సోరెన్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ట్ర పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్‌ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు. బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి హేమంత్‌ పకడ్బందీ వ్యూహాలనే రచించారు.

మరిన్ని వార్తలు