జార్ఖండ్లో కొలువుతీరిన సంకీర్ణ సర్కార్

13 Jul, 2013 10:53 IST|Sakshi
జార్ఖండ్లో కొలువు తీరిన సంకీర్ణ సర్కార్

రాంచీ : ఎట్టకేలకు జార్ఖండ్‌లో సంకీర్ణ సర్కారు కొలువుతీరింది. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ల పొత్తుతో రాష్ట్రపతి పాలన రద్దయి ప్రభుత్వం ఏర్పడింది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత శిబుసోరెన్‌ తనయుడు హేమంత్‌ సోరెన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.  ఆయన చేత ఆ రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఈరోజు ఉదయం రాజ్భవన్లో ప్రమాణం చేయించారు.  ఈ ప్రభుత్వం 2014 డిసెంబర్ వరకూ కొనసాగనుంది.

దేవుని సాక్షిగా హేమంత్‌ ప్రమాణం చేశారు. దాంతో జార్ఖండ్‌ అసెంబ్లీలో 82మంది మెంబర్లకు గాను 42 మంది ఎమ్మెల్యేల మద్దతు గల జార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎమ్‌ఎమ్‌) నాయకుడు హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.  జార్ఖండ్‌ అసెంబ్లీలో 82 స్థానాలున్నాయి. 2010 ఎన్నికలలో బిజెపి, జెఎమ్‌ఎమ్‌లు చెరి 18 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 13, బాబూలాల్‌ మరాండీ నాయకత్వంలోని జార్ఖండ్‌ వికాస్‌ ముక్తి మోర్చాకు 11, ఎజెఎస్‌యుకి 6, ఆర్‌జెడికి 5 స్థానాలు లభించగా ఇతరులు 10 సీట్లు గెలుచుకున్నారు.

కాగా 2000 సంవత్సరంలో బీహార్‌నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైనప్పటినుంచి గత 13 సంవత్సరాలలో జార్ఖండ్‌లో 8 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మూడు సార్లు రాష్టప్రతి పాలన విధించారు. చత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌లతో బాటు జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కేంద్రంలో అప్పట్లో అధికారంలో గల బిజెపియే. ఆ ఖ్యాతి ఖాతాను చూపుకొని జార్ఖండ్‌లో అత్యధిక స్థానాలను బిజెపి కైవసం చేసుకుంటూ వచ్చింది.

 బాబూలాల్‌ మరాండీ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రభుత్వం ఆదిలో రెండేళ్ళకు పైగా కొనసాగింది. ఆ తర్వాత ప్రభుత్వాలు కూలడం, ముఖ్యమంత్రులు మారడం అతిసాధారణమైపోయింది. అర్జున్‌ ముండా, శిబుసోరెన్‌లు మూడు సార్లు ముఖ్యమంత్రి పీఠం అలంకరించగా బాబూలాల్‌ మరండీ, మధుకోడా చెరొక సారి జార్ఖండ్‌ను పాలించారు.

మరిన్ని వార్తలు