తొమ్మిదేళ్ళకే సీఈవో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..!

9 Nov, 2015 17:53 IST|Sakshi
తొమ్మిదేళ్ళకే సీఈవో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు..!

తొమ్మిదేళ్ళకే ఆ కుర్రోడు.. తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. స్వంత గేమ్ అభివృద్ధి సంస్థకు సీఈవోగా, నిష్ణాతుడైన హ్యాకర్‌గా, యాప్ డెవలపర్‌గా, సైబర్ క్రైం బస్టర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఢిల్లీలో జరిగిన  గ్రౌండ్ జీరో సమ్మిట్ 2015 కు హాజరైన వారిలో అత్యంత పిన్న వయస్కుడైన రూబేను పాల్... సమాచార భద్రతపై ఆసియాలో జరిగిన మొట్టమొదటి సమావేశంలో అందరినీ ఆశ్చర్య పరచడమే కాక,  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  

హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరైన ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పరిశోధకులు, సైబర్ నిపుణులు..  మైక్రోఫోన్ పై ప్రసంగిస్తున్నసభలో...  వెనుక ఉన్న కుర్చీపై నిలుచొని తొమ్మిదేళ్ళ  చిన్నారి రూబేను ప్రత్యేకంగా కనిపించాడు. భారత సంతతికి చెందిన ఆ చిన్నారి గత ఏడాది నవంబర్ 14న జరిగిన సదస్సులో తన సొంత కీలకోపన్యాసం చేశాడు.  అయితే  ఈ ఏడాది అతడో స్పెషల్ గెస్ట్ గా మారిపోయాడు. పిల్లలకు సైబర్ భద్రతా బోధనలో తన జ్ఞానాన్ని పంచగలిగే రాయబారి అయిపోయాడు. హ్యాకింగ్ లో నైపుణ్యం పొందగల్గితే ఎంతో శక్తి వస్తుందని, ఆ శక్తి వల్ల ఎంతో బాధ్యత కూడ వస్తుందంటున్నాడు తన హీరోగా  స్పైడర్ మ్యాన్ ను ఊహించుకునే రూబేను.

టెక్సాస్ విద్యా వ్యవస్థ నిర్వహించే టెక్సాస్ లోని ఆస్టిన్ స్కూల్లో  జరిగే గిఫ్టెడ్ ట్యాలెంటెడ్ కార్యక్రమానికి రూబేను ఎంపికయ్యాడని, ఓ గేమ్ ను తయారు చేయడానికి అవకాశం కూడ అతడికి వచ్చిందని రూబేను తల్లి సంగీత తెలిపారు. రూబేను కు వీడియో గేమ్స్ తయారు చేయడం అంటే ఎంతో ఇష్టమని ఇప్పుడు షూటింగ్ నింజా స్టార్స్ గేమ్‌ను చేయాలనుకుంటున్నాడని ఆమె అన్నారు.  ఐదేళ్ళ ప్రాయంలోనే రూబేను ఫైర్ వాల్ వంటి పదాలు వాడుతుండటం చూసి మేము ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళమని రూబేను తండ్రి  తెలిపారు. అతడు యాప్ లు డెవలప్ చేసేందుకు ముందు కుంగ్ ఫూ, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ నేర్చుకునేవాడని, స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేవాడని రూబేను తల్లిదండ్రులు చెప్తూ.. ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు