అంగారకుడి ఉపరితలం కింద హిమనీనదాలు!

10 Apr, 2015 02:09 IST|Sakshi
అంగారకుడి ఉపరితలం కింద హిమనీనదాలు!

లండన్: అరుణగ్రహంపై భారీ హిమనీనదాలు ఉన్నాయట. ఉపరితలంపై దట్టమైన దుమ్ము, ధూళితో కూడిన పొర కింద 150 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంలో గడ్డకట్టిన  హిమనీనదాలు ఉన్నాయట. వాటిలోని మొత్తం మంచును పర్చితే.. అంగారకుడి ఉపరితలంపై ఏకంగా మీటరు మందంతో మంచు పొర ఏర్పడుతుందట. సాధారణంగా మార్స్ ఉపరితలంపై ఎక్కడ చూసినా ఎర్రటి దుమ్ము మాత్రమే కనిపిస్తుంది. కానీ దట్టమైన ఆ దుమ్ముపొర కింద అనేక చోట్ల గడ్డకట్టిన నీరుతో కూడిన భారీ హిమనీనదాలు ఉన్నాయని తాజాగా వెల్లడైంది.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్‌వో) పంపిన రాడార్ సమాచారంతో ఈ విషయం వెలుగుచూసింది. అయితే అరుణగ్రహం ఉపరితలం కింద మంచు ఉండవచ్చని గతంలోనే అంచనా వేసినా, ఆ మంచు నీటితో ఏర్పడిందా? లేక కార్బన్ డయాక్సైడ్ వల్ల ఏర్పడిందా? అన్నది నిర్ధారించలేకపోయారు. ఈ నేపథ్యంలో రాడార్ సమాచారాన్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అది నీటిమంచేనని తేల్చారు. దుమ్ము పొర ఉండటం వల్లే ఆ మంచు ఆవిరైపోకుండా ఉన్నట్లు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు