మహారాష్ట్రలో హై అలర్ట్

23 Sep, 2016 02:42 IST|Sakshi
మహారాష్ట్రలో హై అలర్ట్

- ఉరణ్ పోర్టు వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారం
ఉగ్రవాదులుగా అనుమానం
 
 సాక్షి, ముంబై: ముంబై సమీపంలో ఉగ్రవాద కదలికల సమాచారంతో మహారాష్ట్ర సర్కారు హైఅలర్ట్ ప్రకటించింది. రాయ్‌గడ్ జిల్లా ఉరణ్ నేవీ యార్డు సమీపంలో ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో కనిపించారన్న వార్త నేపథ్యంలో అప్రమత్తమైంది. అనుమానిత వ్యక్తుల కోసం వేట మొదలైంది. ఉరణ్‌లో ప్రభుత్వ సంస్థల కీలకమైన కార్యాలయాలు, స్థావరాలున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు, ఓఎన్‌జీసీ, నౌకాదళ స్థావరాలున్నాయి.  

 విద్యార్థులు చూసి..
 గురువారం ఉదయం కుంబార్ వాడా, కరంజా ప్రాంతంలో ఆరుగురు అపరిచిత వ్యక్తులు సైనిక దుస్తుల్లో తుపాకులు చేతబట్టుకుని వెళ్లిన విషయాన్ని కొందరు విద్యార్థులు గమనించారు. పాఠశాలకు వెళ్లాక దీన్ని టీచర్‌కు చెప్పారు. విద్యార్థులు చెబుతున్నది నిజమేనని స్కూలు యాజమాన్యం నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమందించింది. అప్రమత్తమైన పోలీసులు, కోస్టుగార్డు, నావికాదళం, జాతీయ భద్రత దళాలు గాలింపు చేపట్టాయి.  సముద్ర మార్గం ద్వారా రద్దీ తక్కువగా ఉండే ఉరణ్ గుండా ఉగ్రవాదులు ప్రవేశించారా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. స్థానిక మత్స్యకారులను కూడా విచారిస్తున్నారు. ముంబై తీర ప్రాంతంలోనూ కూంబింగ్ ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు