కర్ణాటకలో హైఅలర్ట్‌!

18 Aug, 2019 03:40 IST|Sakshi
బెంగళూరులో అప్రమత్తంగా సైనికుడు

ఉగ్ర ముప్పుందని నిఘావర్గాల హెచ్చరిక

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ప్రధాన పట్టణాల్లో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు సిద్ధమయ్యారని నిఘావర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. బెంగళూరుతో పాటు కలబురిగి, రాయచూర్, చిత్రదుర్గ, మంగళూరు, ఉడిపి, మైసూరు, తుమకూరు సహా ముఖ్యమైన పట్టణాల్లో భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్లు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఉగ్రవాదులు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా జనసమ్మర్ధ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులుచేసే అవకాశముందని చెప్పాయి’ అని అన్నారు.

కల్బుర్గీ హత్య కేసులో చార్జిషీట్‌
హేతువాదులు కల్బుర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్య కేసులో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ శనివారం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. షూటర్‌ గణేశ్‌ మిస్కిన్, అమోల్‌ కాలే, ప్రవీణ్‌ప్రకాశ్, వసుదేవ్‌ భగవాన్, శరద్‌ కలస్కర్, అమిత్‌ రామచంద్ర వీరి హత్యలకు కుట్రపన్నారని సిట్‌ తెలిపింది. హిందూ అతివాద గ్రూపు ‘సనాతన సంస్థ’ ప్రచురించిన ‘క్షేత్ర ధర్మ సాధన’ అనే పుస్తకంతో వీరంతా స్ఫూర్తి పొందారంది. 2014, జూన్‌ 9న మూఢనమ్మకాలపై కల్బుర్గీ ఇచ్చిన ప్రసంగంతో ఆయన్ను చంపాలని ఈ బృందం నిర్ణయించుకుందని పేర్కొంది. అనుకున్నట్లుగానే ఓ తుపాకీని సేకరించి తర్ఫీదు పొందారనీ, దాడికోసం బైక్‌ను దొంగిలించారని సిట్‌ చెప్పింది. కల్బుర్గిని ఇంట్లోనే మిస్కిన్‌ కాల్చిచంపాడని తెలిపింది.

>
మరిన్ని వార్తలు