తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి రాలేదన్న సీఎం కిరణ్‌

11 Jul, 2013 05:39 IST|Sakshi
తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి రాలేదన్న సీఎం కిరణ్‌

సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీకి సమర్పించాల్సిన రోడ్‌మ్యాప్‌లో పొందుపరచాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం తెలంగాణ, సీమాంధ్ర మంత్రులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న ఇరు ప్రాంతాల మంత్రులతో సాయంత్రం రెండు గంటలసేపు సీఎం తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఏర్పాటుకు సహకరించాలని తెలంగాణ మంత్రులు, సమైక్యంగానే ఉంచేలా అధిష్టానానికి నివేదించాలని సీమాంధ్ర మంత్రులు కోరారు.వారి అభిప్రాయాలు తీసుకున్నారే తప్ప అధిష్టానం ఆలోచన ఎలా ఉందన్న దానిపై కిరణ్ ఎక్కడా చర్చించలేదని తెలిసింది. ముందు తెలంగాణ మంత్రులతో జరిగిన భేటీలో డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సారయ్య, ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి కె.జానారెడ్డి మాత్రం హాజరుకాలేదు.

సీమాంధ్ర మంత్రుల భేటీలో బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కొండ్రు మురళి, పార్థసారథి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, అహ్మదుల్లా ఇందులో పాల్గొన్నారు. వేర్వేరుగా మాట్లాడాలా, లేక అంతా ఒకే దగ్గర కూర్చొని మాట్లాడదామా అని సమావేశానికి ముందు మంత్రులను సీఎం అడిగారు. వేర్వేరు అభిప్రాయాలుంటే ఒక్కొక్కరితో వేరుగా మాట్లాడతానని చెప్పారు.

సీమాంధ్ర మంత్రులు తమదంతా ఒక్కటే అభిప్రాయం కనుక అంతా కలిసే మాట్లాడతామని సీఎంకు వివరించారు. సీమాంధ్ర మంత్రుల భేటీ తర్వాతబొత్సతో తెలంగాణ మంత్రులు సమావేశమయ్యారు. సమాచారం లేని కారణంగా సీఎం భేటీకి వెళ్లలేకపోయామని పలువురు మంత్రులు చెప్పారు. బొత్స గురువారం ఉదయం, కిరణ్, దామోదర సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, తాజా మాజీ ఇన్‌చార్జి ఆజాద్‌లతో దామోదర గురువారం రాత్రి భేటీ కానున్నారు.

తెలంగాణ ఏర్పాటే మంచిది
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని, అధిష్టానంతో పాటు ఇరు ప్రాంతాల్లోనూ సానుకూల వాతావరణం ఉన్నందున అందుకు సహకరించాలని తెలంగాణ మంత్రులు కిరణ్ ముందు వాదన విన్పించారు. విభజన వల్ల తెలంగాణతో పాటు సీమాంధ్ర కూడా అభివృద్ధి సాధిస్తుంది. రెండు రాజధానులు, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి వల్ల మంచి జరుగుతుంది. దిగ్విజయ్‌సింగ్ ప్రకటనలతో తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆశలు పెరిగాయి. ఇప్పుడు ఏమాత్రం వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా పరిణామాలు ప్రభుత్వానికి, పార్టీకి పెను ప్రమాదంగా పరిణమిస్తాయి. విషయాన్ని కీలక దశకు పార్టీయే తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని అమలు చేసి చూపిస్తేనే తెలంగాణ ప్రజల మన్ననలు పొందగలుగుతాం’’ అని వివరించారు. తాము చెప్పిన అన్ని అంశాలను సీఎం నోట్ చేసుకున్నారని, వాటిని అధిష్టానానికిచ్చే నివేదికలో పొందుపరుస్తానని చెప్పారని మంత్రులు పేర్కొన్నారు. అధిష్టానం ఆలోచనలేమిటో ఎవరికీ తెలియదని, వారి నిర్ణయం కోసం వేచిచూద్దామని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

విభజిస్తే వెనుకబడ్డట్టే...
విభజనతో ఇరు ప్రాంతాల్లోనూ అభివృద్ధి కుంటుపడుతుందని, అది ఇరుప్రాంతాల ప్రజలకూ తీరని నష్టం కలిగించేదేనని సీమాంధ్ర మంత్రులు సీఎంతో అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయంగా చూసినా రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి కూడా నష్టమే. ఛిన్నాభిన్నమవుతుంది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్రలో తీవ్రంగా దెబ్బతింటాం. తెలంగాణాలోనూ కలిసొచ్చే పరిస్థితి లేదు. పైగా మున్ముందు నీటి సమస్యలు తీవ్రమవుతాయి. అది చివరకు ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది. రాజధాని ఏర్పాటు పెద్ద సమస్య అవుతుంది. హైదరాబాద్ అంశమూ జటిలంగా మారుతుంది. సాధ్యమైనంత మేరకు రాష్ట్రం సమైక్యంగానే ఉండేలా అధిష్టానానికి నివేదించండి. హైదరాబాద్‌లో ఇరు ప్రాంతాల వారూ కట్టే ఆదాయం వల్ల తెలంగాణకూ లాభం చేకూరుతోంది. రాష్ట్ర ఆదాయంలో 42 శాతం రాజధాని నుంచే వస్తోంది’’ అన్నారు.

అధిష్టానం నిర్ణయానికి రాలేదు: సీఎం
తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసేసుకుందని, రాష్ట్ర నేతల నుంచి రోడ్‌మ్యాప్ పేరుతో మొక్కుబడి నివేదికలే తీసుకుంటోందనిప్రచారం జరుగుతోందని కొందరు మంత్రులు చెప్పగా, ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సీఎం వివరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడం వల్ల వచ్చే లాభాలేమిటి, విడిపోవడం వల్ల తలెత్తే సమస్యలు, నష్టాలేమిటన్న అంశాలను తన నివేదికలో పొందుపరుస్తున్నానని వివరించారు. దామోదర రోడ్ మ్యాప్ రూపకల్పన పనుల్లో ఉండటంతో భేటీకి రాలేదు. ఆయన బుధవారం ప్రవాస తెలంగాణ వాదులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను గట్టిగా వినిపించారు. దాన్ని కూడా డిప్యూటీ సీఎం తన నివేదికలో పొందుపరుస్తున్నారు.

మరిన్ని వార్తలు