కరోనా ఎఫెక్ట్‌ : వణుకుతున్న మహారాష్ట్ర

15 Mar, 2020 19:58 IST|Sakshi

మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌

32కి చేరిన కోవిడ్‌ బాధితులు.. అప్రమత్తమైన ప్రభుత్వం

దేశంలో 108కి చేరిన కరోనా కేసులు

సాక్షి ముంబై : కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) మహారాష్ట్రలో వేగంగా వ్యాపిస్తోంది. ఒక్కరోజులోనే 16 మంది కోవిడ్‌ రోగులు పెరిగారు. దీంతో రాష్టంలో కరోనా బాధితుల సంఖ్య 32కి చేరింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఈ కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలు, కళాశాలలు, అంగనవాడి కేంద్రాలన్నింటిని  మార్చి 31వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్‌ టోపే తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌సీ, హెచ్‌ఎస్‌సీ పరీక్షలు మాత్రం కొనసాగనున్నాయన్నారు. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, అంగనవాడి కేంద్రాలు బంద్‌ ఉండనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. కోవిడ్‌ –19(కరోనా వైరస్‌) లక్షణాలున్నవారిని గుర్తించి వారికీ వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్స నిర్వహిస్తున్నారు. (సైబర్‌ టెక్నాలజీతో కరోనా నిర్మూలన!)

మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది. కోవిడ్‌ –19(కరోనా వైరస్‌) రోగుల చికిత్స కోసం సంబంధిత ఆసుపత్రులలో కావల్సిన వేంటిలేటర్స్, బెడ్‌ ఇతర మందులు, మాస్క్‌లు, సనిటైజర్‌ తదితరాలు అందుబాటులో ఉంచుతున్నాం. ముఖ్యంగా అనవసరంగా రద్దీ చేయవద్దని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు. వీరిలో అత్యధికంగా పుణేలో 16, ముంబైలో ఐదుగురు, నాగపూర్‌లో నలుగురు, థానేలో ఒక్కరు, యావత్మాల్‌లో ఇద్దరు, కళ్యాణ్‌లో ఒక్కరు, అహ్మదనగర్‌లో ఒక్కరు, రాయిగడ్‌లో ఒక్కరు నవీముంబైలో ఒక్కరు ఇలా వైరస్‌ పాజిటీవ్‌ వచ్చిందన్నారు. దీంతో రాష్ట్రంలోని కరోనా బారిన పడిన వారి సంఖ్యలో దేశంలోనే అత్యధికంగా మారింది. అయితే ఈ విషయంపై భయాందోళనలు చెందకుండా అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో వైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్‌ తీవ్రత అధికారంగా ఉంది.

కరోనా రోగుల చికిత్స ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది
కరోనా రోగుల చికిత్స కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలు చెందకుండా ఉండేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఈ వైరస్‌ బారిన పడిన వారి చికిత్స ఖర్చును ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.      
 

మరిన్ని వార్తలు