‘మిర్చ్‌పూర్‌’ దోషులకు యావజ్జీవం

25 Aug, 2018 04:03 IST|Sakshi

దళితుల సజీవదహనం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు

న్యూఢిల్లీ: 2010లో సంచలనం సృష్టించిన మిర్చ్‌పూర్‌ దళితుల సజీవ దహనం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. జాట్‌ వర్గానికి చెందిన 12 మందికి యావజ్జీవ శిక్ష, మరో 21 మందికి వేర్వేరు జైలు శిక్షలు విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. దోషులకు విధించిన జరిమానాను బాధితుల పునరావాసానికి ఖర్చు చేయాలని సూచించింది. 2010, ఏప్రిల్‌లో హరియాణాలోని హిసార్‌ జిల్లా మిర్చ్‌పూర్‌ గ్రామంలో దళితులు, జాట్లకు మధ్య జరిగిన వివాదం నేపథ్యంలో 60 ఏళ్ల తారాచంద్‌ అనే వ్యక్తిని, దివ్యాంగురాలైన ఆయన కూతురిని సజీవదహనం చేశారు.

జాట్‌ వర్గీయుల దాడుల్లో పలువురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. భారీఆస్తినష్టం జరిగింది. ఈ కేసులో 98 మందిని నిందితులుగా చేర్చగా, ట్రయల్‌ కోర్టు 15 మందిని దోషులుగా తేల్చి, వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించింది. ట్రయల్‌ కోర్టు నిర్దోషులుగా తేల్చిన 20 మందిని తాజాగా హైకోర్టు దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది. వాల్మీకి వర్గానికి చెందిన వారి ఇళ్లే లక్ష్యంగా, ప్రణాళికతో జాట్లు దాడులకు పాల్పడినట్లు విచారణలో స్పష్టమైందని వ్యాఖ్యానించింది. తీర్పు వెలువరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘వాల్మీకీ వర్గీయులకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే దాడులు జరిగాయి. ఇది కుల విభేదాలకు సంబంధించిన హింస. స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు గడచినా దళితులపై అగ్రవర్ణాల దాడులు ఆగట్లేవు. సమానత్వం, సౌభ్రాతృత్వం అనే రెండు అంశాలు భారతీయ సమాజంలో ఏ మాత్రం కనిపించడం లేదు అంటూ 1949లో రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వాస్తవాలుగానే కనిపిస్తున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది.   మిర్చ్‌పూర్‌లో లోహర్లు, చమర్లు, వాల్మీకీలు, బ్రాహ్మణులు, జాట్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో జాట్లది ప్రాబల్య వర్గం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా