హోం వర్క్‌ రద్దు

30 May, 2018 08:52 IST|Sakshi

1, 2 తరగతి విద్యార్థులకు కోర్టు బాసట

పుస్తక భారంపై హైకోర్టు సీరియస్‌

ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలు అమలు చేయాల్సిందే

సీబీఎస్‌ఈ విద్యా సంస్థలకు హుకుం

సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్‌ మేరకు విద్యా బోధనలు సాగిస్తున్న ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఇక మీదట హోం వర్క్‌ను రద్దుచేస్తూ మద్రాసు హైకోర్టు ఆదేశాలుజారీచేసింది. పుస్తక భారం మళ్లీ పెరుగుతుండడంపై కోర్టు తీవ్రంగా పరిగణించింది.ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనల్ని సీబీఎస్‌ఈ విద్యా సంస్థలు తప్పనిసరిగాఅమలుచేయాల్సిందేని హుకుం జారీచేసింది.

సాక్షి, చెన్నై :  ఇటీవల రాష్ట్రంలో సీబీఎస్‌ఈ విద్యా సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇందుకు కారణం అన్నీ నీట్‌ మయం కావడమే. నీట్‌ తరహా శిక్షణ అంటూ ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థుల మీద భారాన్ని మోపే రీతిలో సీబీఎస్‌ఈ విద్యా సంస్థలు విద్యాబోధనల్ని సాగిస్తున్నాయి. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ సీబీఎస్‌ఈ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు బయలుదేరాయి. నిర్ణీత పుస్తకాల కంటే, ప్రైవేటు పుస్తకాలను సైతం విద్యార్థుల మీద రుద్దే ప్రయత్నాలు సాగుతున్నాయి. వివిధ పోటీ పరీక్షలు అన్నట్టుగా ప్రైవేటు పుస్తకాల ప్రభావాన్ని విద్యార్థులు మీద మోపుతుండడాన్ని చెన్నైకి చెందిన న్యాయవాది పురుషోత్తమన్‌ పరిగణనలోకి తీసుకున్నారు. ఇటీవల ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీబీఎస్‌ఈలోనూ పుస్తకాల మోత పెరిగిందని, ప్రాథమిక విద్యను అభ్యషిస్తున్న విద్యార్థులు సైతం తమ వయసుకు మించిన పుస్తకాలను మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆధారాలతో కోర్టుకు వివరించారు. విద్యార్థులు అత్యధిక బరువు మోయకూడదని, తక్కువ పుస్తకాలను, ఎంపిక చేసిన పుస్తకాలను మాత్రమే ఉపయోగించాలని ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలు పేర్కొంటున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు హోం వర్క్, అసైన్‌మెంట్‌ అంటూ రకరకాల భారాన్ని ఇంటివద్ద సైతం మోపుతున్నారని వివరించారు. ఆని రకాల నియమ నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయని, దీనిని కట్టడి చేయాలని కోరారు.

కోర్టు ఆగ్రహం
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి కృపాకరణ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణకు స్వీకరించి, ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈలకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు ఎన్‌సీఈఆర్‌టీ కార్యదర్శి హర్షకుమార్‌ వివరణ ఇచ్చారు. ప్రాథమిక స్థాయిలో ఒకటి, రెండు తరగతులకు హోంవర్క్‌ ఇవ్వకూడదన్న నిబంధన ఉందన్నారు. అలాగే, మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులకు వారంలో రెండు గంటలు మాత్రమే హోం వర్క్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. పుస్తకాలు సైతం తక్కువ సంఖ్యలోనే ఉపయోగించాల్సి ఉందని, అది కూడా తాము ఎంపిక చేసిన పుస్తకాలు మాత్రమేనని వివరించారు. విద్యార్థుల మీద ఒత్తిడి, భారం ఉండ కూడదన్న నిబంధనలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కార్తికేయన్‌ బెంచ్‌ ముందు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు. ఇక, సీబీఎస్‌ఈ వర్గాలు తమ తరఫున నిబంధనల్ని కోర్టు దృష్టికి తెచ్చారు. వీటన్నింటిని పరిశీలించి మంగళవారం న్యాయమూర్తి కృపాకరణ్‌ తీర్పు ఇచ్చారు.

పుస్తక భారం తగ్గించాలి
న్యాయమూర్తి కృపాకరణ్‌ తీర్పు వెలువరిస్తూ, విద్యార్థులకు పుస్తకాలు భారం అని పేర్కొంటూ, ఇందుకు తగ్గ ముసాయిదా ఒకటి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. ఈ దృష్ట్యా, పుస్తక భారం తగ్గింపు వ్యవహారంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఎంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటే, విద్యార్థులకు అంత శ్రేయస్కరం అని అభిప్రాయ పడ్డారు. సీబీఎస్‌ఈ, స్టేట్‌ సిలబస్, ఇతర సిలబస్‌ అనుసరిస్తున్న వారందరికీ ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంటూ, ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు హోం వర్క్‌ను రద్దుచేస్తున్నామని ప్రకటించారు. అలాగే, ఎన్‌సీఈఆర్‌ నిబంధనల్ని తప్పనిసరిగా అనుసరించాల్సిందేని విద్యా సంస్థలకు హుకుం జారీచేశారు. ఆ నియమ నిబంధనల మేరకు ఎంపిక చేసిన పుస్తకాలను ఉపయోగించాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ తీర్పు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేశారు.  ఏమేరకు అమలు చేశారో నాలుగు వారాల్లోపు సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్, స్టేట్‌ సిలబస్‌(రాష్ట్ర ప్రభుత్వం) నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే, హోం వర్క్‌ రద్దు చేశారా? లేదా, చాప కింద నీరులా హోం వర్క్‌ను విద్యార్థులకు ఇస్తున్నారా..? అని నిఘా వేసే రీతిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను రంగంలోకి దించాలని తీర్పు వెలువరించారు. 

మరిన్ని వార్తలు